తెలంగాణలో కొత్త పార్టీ పురుడు పోసుకోవడం ఖరారైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో బలంగా గలం వినిపించిన నాయకుడు మరో నాకుడు తెరమీదకు వచ్చారు. పార్టీ పెడతానంటూ ప్రకటించారు. ఆయనే..ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్. కమ్యూనిజం గలం విప్పిన గద్దర్ తాజాగా ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తన అభిమానులతో గద్దర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ఆరు నెలలు రాష్ట్రమంతటా తిరుగుతానని - ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ప్రజల నిర్ణయం మేరకు రాజకీయాల్లోకి వస్తున్నానని - వేములవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని వివరించారు. ఆగస్టులో పార్టీ నిర్మాణం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. `నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో 32 మందిలో ముగ్గురం బ్రతికాం. ఇప్పుడు పోరాట రూపం మారింది. అభిమానులు ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ లో వస్తాను. అందుకే ఓట్ రిజిస్టర్ చేసుకుంటున్నాను. మార్క్స్ - పూలే - అంబేడ్కర్ స్ఫూర్తితో పార్టీని ఏర్పాటు చేసి ముందుకు సాగుతాను`` అని గద్దర్ వివరించారు.
పార్టీ ఏర్పాటు చేయడం - ప్రజల మనస్సు గెలవడం తేలికగా అయ్యే పనికాదని గద్దర్ తెలిపారు. ``నేను చదవని పుస్తకం లేదు.. పోనీ ప్రాంతం లేదు..తెలియని భాషా లేదు. ఎర్ర జెండాతో నీలి జెండా కలుపుకుని తిరిగాను. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓటు కార్పోరేట్ అయింది అయినా...ఓట్ల పోరాటంలోకి వస్తున్నాను. ఓట్ల విప్లవం తీసుకురావాలి. పార్టీ నిర్మాణం కోసం త్యాగం చేయాలి. శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అందుకే పార్టీ ఏర్పాటు దానికి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ వరకు చర్చ చేస్తాం. పార్టీ అంటే ఏంటో పీఆర్పీ స్థాపించిన చిరంజీవిని అడగడానికి వెళ్తాను. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను కుడా అడుగుతాను. వేములవాడలో లక్షలాది మందితో సభ నిర్వహిస్తా.భావస్పష్టత కలిగిన పార్టీలతో మీటింగ్ పెడుదాం. మన మేనిఫెస్టో స్పష్టంగా చెప్పాలి.రండి...నాతో ముందుకు వెళదాం`` అని పిలుపునిచ్చారు.