ఎన్నిక‌ల బ‌రిలో గ‌ద్ద‌ర్ వార‌సుడు?

Update: 2018-10-30 07:41 GMT
ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య‌కిర‌ణ్ తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సూర్య‌కిర‌ణ్ పోటీ చేస్తార‌ని ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం సాగుతోంది. గ‌ద్ద‌ర్ త‌న కుమారుణ్ని వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లి రావ‌డం కూడా ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తోంది.

తెలంగాణ‌లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ పోక‌డ‌ల‌పై ఆగ్ర‌హంగా ఉన్న గ‌ద్ద‌ర్ ఇటీవ‌లే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిశారు. హ‌స్తం పార్టీకి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే, అధికారికంగా ఆ పార్టీలో మాత్రం చేర‌లేదు. వాస్త‌వానికి గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్‌ పై కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌ద్ద‌ర్ బ‌రిలో దిగుతార‌ని తొలుత జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని ఆయ‌న తేల్చిచెప్పేశారు.

తాజాగా గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య‌కిర‌ణ్ రాజ‌కీయ అరంగేట్రంపై ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. గ‌ద్ద‌ర్ రాహుల్‌ను క‌ల‌వ‌డానికి ముందే సూర్య‌కిర‌ణ్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డితోపాటు ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో ఆయ‌న‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో కుమారుణ్ని ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బెట్టాల‌ని గ‌ద్ద‌ర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే సూర్య‌కిర‌ణ్‌ను వెంట‌బెట్టుకొని గ‌ద్ద‌ర్ ఢిల్లీ వెళ్లారు. సోనియా గాంధీ - రాహుల్ గాంధీ వంటి పార్టీ పెద్ద‌ల‌ను క‌లిశారు.

టికెట్ ఖాయం చేసుకునేందుకే తండ్రీ కొడుకులు జంట‌గా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని ప‌లువురు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సూర్య‌కిర‌ణ్ పోటీ చేయ‌డం ఖ‌రారైంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. వాస్త‌వానికి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని సూర్య‌కిర‌ణ్ భావించార‌ని.. అయితే, ఆ నియోజ‌క‌వ‌ర్గం కోసం కాంగ్రెస్‌ లో పోటీ తీవ్రంగా ఉండ‌టంతో ఆయ‌న మ‌న‌సు మార్చుకున్నార‌ని తెలుస్తోంది. ఇక కుమారుడి త‌ర‌ఫున గ‌ద్ద‌ర్ త‌న హుషారైన‌ ఆట‌పాట‌ల‌తో ప్ర‌చార ప‌ర్వాన్ని హోరెత్తించ‌డం ఖాయ‌మ‌నీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News