ఎన్నికల సముద్రంలో ప్రజా యుద్ధ నౌక?

Update: 2015-08-06 07:51 GMT
తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ పేరు వింటే చాలు గజ్జెలు దానికవే ఆడుతాయి... గొంతులు వాటికవే పలుకుతాయి.. పాటలు కత్తుల్లా గుచ్చుకుంటాయి... ప్రశ్నలు తూటాల్లా ఉదయిస్తాయి.. పిడికిళ్లు బిగుసుకుంటాయి... అందుకే ప్రజా గాయకుడు గద్దర్ ను ప్రజా యుద్ధనౌకగా పిలుచుకుంటారు. ఇప్పుడీ యుద్ధనౌకను వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటీకి దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు ఆయనను పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా విశేష ప్రజాదరణ ఉన్న గద్దర్‌ను పోటీకి దించితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గట్టి సవాల్ విసిరినట్లు అవుతుందని వామపక్షాలు భావిస్తున్నాయి.

తెలంగాణ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా చేరడంతో వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఆ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ కారణంగా అక్కడ ఉపఎన్నిక వస్తోంది. దీంతో ఆ స్థానంలో టీఆరెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సరైన అభ్యర్థిని నిలపాలనే ప్రయత్నంలో గద్దర్ పేరు పరిశీలిస్తున్నాయి.  తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు మల్లేపల్లి లక్ష్మయ్య, జనగాంకు చెందిన వైద్యుడు రాజమౌళి పేర్లూ వామపక్షాల పరిశీలనలో ఉన్నాయి. వీరిలో గద్దర్ అయితే బాగుంటుందని వామపక్షాలు భావిస్తున్నాయి.  దీంతో గద్దర్‌ను ఒప్పించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర వామపక్షాల నేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... ఆయన ఇంతవరకు ఏమీ తేల్చలేదని చెబుతున్నారు. మరి గద్దర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ఒకప్పుడు నక్సల్స్ ఉద్యమాల్లో కీలకంగా వ్వవహరించిన గద్దర్ గనుక ఎన్నికల బరిలో దిగితే అది ప్రజాస్వామ్యంలో మేలి మలుపే కానుంది... అదేసమయంలో వరంగల్ స్థానానికి పోటీ కూడా తీవ్రం  కానుంది.
Tags:    

Similar News