ప్రత్యక్ష రాజకీయాల్లోకి గద్దర్?

Update: 2017-04-07 09:03 GMT
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల తరబడి విప్లవ పార్టీల్లో ... వాటికి అనుబంధంగా బయట ఉన్న ఆయన ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చేశారు. మావోయిస్టు పార్టీని వీడుతున్నానని, ఎర్ర జెండాను పక్కన పెట్టానని సంచలన ప్రకటన చేశారు.
    
అయితే.. గద్దర్ ఇకపై ఏం చేస్తారన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. తాను 'పల్లె పల్లె పార్లమెంటుకు' అనే నినాదంతో జనం ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. తనపై హత్యాయత్నం జరిగి 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మాతృసంస్థ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటిస్తూ, అమర వీరులకు వందనాలు పలికి, చేతిలో ఉన్న ఎర్ర జెండాను పక్కన బెట్టి, బుద్ధుడి జెండా కట్టిన కర్రను ఆయన చేతిలోకి తీసుకున్నారు.
    
కేవలం అభిప్రాయ భేదాల వల్లే  తాను మావోయిస్టు పార్టీని వీడినట్టు ఆయన తెలిపారు. కేవలం మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదని, అంబేద్కర్, పూలేల మార్గం కూడా అవసరమని తాను మావోలతో చర్చించానని తెలిపారు. రెండు దశాబ్దాలుగా నాలో తుపాకీ తూటాలను మోశానని, ఇక రెండు పడవలపై కాళ్లు పెట్టలేనని అర్థమైందని అన్నారు. ఓటరుగా కూడా నమోదు చేయించుకున్నానని, ఇప్పుడు తాను ఏ రాజకీయ పార్టీ సభ్యత్వమూ లేని ఓటరునని స్పష్టం చేశారు.
    
అయితే... గద్దర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని కొందరు... ఉన్న పార్టీల మద్దతుతో చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి గద్దర్ ఏం చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News