చిన్న గుడి కూల్చ‌టంపై గాలి ఓపెన్‌..!

Update: 2017-12-25 15:30 GMT
వ్యాపార‌వేత్త‌గా సుప‌రిచితుడు ఐరన్ ఓర్ బిజినెస్ లో మొన‌గాడిగా పేరున్న గాలి జ‌నార్ద‌న‌రెడ్డి టాపిక్ వ‌చ్చినంత‌నే గుర్తుకు వ‌చ్చే ముఖ్య‌మైన విష‌యం.. త‌న ఐరెన్ఓర్ త‌వ్వ‌క దాహానికి..  శ‌తాబ్దాల నాటి సుంక‌ల‌మ్మ దేవాల‌యాన్ని కూల్చేసిన‌ట్లుగా చెబుతారు. ఈ వ్య‌వ‌హారం మీద ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చినా గాలి స్పందించింది లేదు.

గాలికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఐరెన్ ఓర్ త‌వ్వ‌కాలు ఎంత జ‌రిగినా ఎదురుదెబ్బ‌లు తగ‌ల‌ని గాలికి.. ఎప్పుడైతే సుంక‌ల‌మ్మ దేవాల‌యాన్నికూల్చేశారో.. అప్ప‌టినుంచో  ఆయ‌న‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని.. గుడిని కూల్చిన పాపం ఆయ‌న్ను వెంటాడింద‌న్న మాట ఉంది.

తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన గాలి.. త‌న‌పై ఉన్న గుడిని కూల్చే ఆరోప‌ణ‌పై స్పందించారు. దీనికి ఆయ‌నేం చెప్పార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే.. "మాకు గ‌నులు లీజుకు ఇచ్చిన వాళ్లు ప‌దేళ్ల క్రితం కొండ‌పై ఒక ఆల‌యాన్ని కట్టారు. ఆ ఆల‌యం అక్క‌డ ఉండ‌రాద‌ని మైనింగ్ శాఖ కూడా చెప్పింది. దానిపై హైకోర్టులో చాలానే కేసులు న‌మోదయ్యాయి. విచార‌ణ‌లో ఆ ఆల‌యం పురాత‌న‌మైంది కాద‌ని.. ఈ మ‌ధ్య‌నే క‌ట్టింద‌ని తేలింది" అని చెప్పారు.

త‌న‌కు చిన్న‌త‌నం నుంచి సెంటిమెంట్లు ఉన్నాయ‌ని.. ఇప్ప‌టికి పాటిస్తున్నాన‌ని చెప్పారు. ఇన్ని చెప్పిన గాలి.. సుంకుల‌మ్మ దేవాల‌యం చాలా కొత్త టెంపుల్ గా చెప్పటం గ‌మ‌నార్హం.  ల‌క్ష కోట్లు సంపాదించార‌న్న ప్ర‌చారంపై ప్ర‌శ్నించిన‌ప్పుడు త‌న మీద జ‌రిగే ప్ర‌చారానికి నిజానికి సంబంధ‌మే లేద‌న్నారు.

త‌న ట‌ర్నోవ‌ర్ 887 కోట్లు అని.. 22 మిలియ‌న్ ట‌న్నుల ఐర‌న్ ఓర్ వ్యాపారం చేస్తే దాని మొత్తం విలువ రూ.2వేల కోట్లు ఉంటుంద‌ని.. అదే ప్ర‌చారంలోకి వ‌చ్చేస‌రికి రూ.ల‌క్ష కోట్లుగా మారింద‌న్నారు. రెండు వేల కోట్ల‌లో రూ.వెయ్యి కోట్లు బ్ర‌హ్మ‌ణీ సిమెంట్స్ లో పెట్టామ‌ని.. మిగిలిన వెయ్యి కోట్లు ఇత‌ర డైరెక్ట‌ర్లు.. షేర్ హోల్డ‌ర్స్‌.. డివిడెంట్లు.. అన్నీ పోను కొన్ని వంద‌ల కోట్లే ఉంటాయ‌న్నారు. అయితే.. దానికే విప‌రీతంగా ప్ర‌చారం చేశార‌న్నారు. హెలికాఫ్ట‌ర్ కొన్న‌ది ఆర్భాటం కోసం కాద‌ని.. టైమ్‌ ను సేవ్ చేయాల‌నేన‌ని చెప్పారు. కుమార్తె పెళ్లికి భారీగా ఖ‌ర్చు చేసిన వైనాన్ని ప్ర‌స్తావించ‌గా.. త‌న కూతురు పెళ్లికి చేసింది పెద్ద అర్భాట‌మే కాద‌న్నారు.

త‌న‌కు కూతురు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆమెపై ఎక్కువ ప్రేమ ఉండేద‌ని.. తాను బిజినెస్ లో భాగంగా చేసే ఏ ప‌నినైనా క‌ల‌ర్ ఫుల్ గా చేయాల‌ని అనుకునేవాడిన‌ని.. అందుకు కుమార్తె పెళ్లిని ఘ‌నంగా చేయాల‌నే చేశామ‌న్నారు.  బ‌ళ్లారిలో తాను చేసే సామూహిక వివాహాలే ఎంతో ఘ‌నంగా జ‌రుగుతాయ‌ని.. అలాంటి త‌న కుమార్తె పెళ్లిని ఆ మాత్రం ఘ‌నంగా చేయ‌కుంటే ఏం బాగుంటుంద‌న్నారు.  త‌న కూతురు పెళ్లి కోసం చేసిన ఖ‌ర్చు మొత్తం (న‌గ‌ల‌తో స‌హా) క‌లిపినా రూ.30 కోట్లు కాద‌ని.. కానీ.. రూ.500 కోట్లు అని ప్ర‌చారం చేశార‌న్నారు. పెళ్లి జ‌రిగిన ప‌క్క‌రోజే ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు వ‌చ్చి త‌నిఖీ చేశార‌ని.. వారంద‌రికి అన్ని బిల్లులు ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.
Tags:    

Similar News