మా సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ కుక్కలంటావా?

Update: 2015-09-29 04:26 GMT
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకులిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమానికి హాజరైన ఆశ కార్యకర్తలు తమ డిమాండ్లను తీర్చాలంటూ వినతిపత్రం ఇచ్చి.. నిరసన వ్యక్తం చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆంధ్రా కుక్కలు వెనకుండి నిరసనలు నిర్వహించేలా చేస్తున్నాయంటూ చెలరేగిపోవటం తెలిసిందే.

జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు సీమాంధ్ర నేతలే కాదు.. తెలంగాణ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఏమిటని విరుచుకుపడుతున్నారు. ఏపీ టీడీపీ ఫైర్ బ్రాండ్ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందిస్తూ.. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇరు ప్రాంతాల మధ్య విభేధాలు సృష్టించేలా రెచ్చగొట్టి మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు.

ఆంధ్రా కుక్కలంటూ ఏపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జగదీశ్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మేం వదిలిన సొమ్ములతో షోకులు తిప్పుతున్నారు. ఆంధ్రావాళ్లు చేసిన అభివృద్ధితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడిలా మాట్లాడతారా? మాకూ నోరుంది. మేం కూడా మాట్లాడగలం. కానీ.. సభ్యత.. సంస్కారం చాలా అవసరం’’ అంటూ మండిపడ్డారు.

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ మాత్రమే కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేని సుధాకర్ రెడ్డి సైతం స్పందించారు. విద్యుత్తు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన్ను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు.

కొందరిని ఉద్దేశించి.. ఆంధ్రా కుక్కలంటూ జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వార్తలు వచ్చాయని.. అవి కానీ నిజమైన పక్షంలో ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలా పడితే అలా మాట్లాడటం మంచిది కాదని.. అభ్యంతర భాష వాడొద్దన్నారు. మరి దీనిపై తెలంగాణ అధికారపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News