పదేళ్లు వదిలేది లేదట

Update: 2015-06-24 11:11 GMT

ఉమ్మడి రాజధాని, సెక్షన్ 8పై రాజకీయ చర్చ జోరుగా సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని...ఆంధ్రప్రదేశ్ విభజన, ఆర్థిక పరమైన అంశాల వరకు అన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ....వివరాలన్నీ తవ్వితీస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో..ఆంధ్రప్రదేశ్ కు అంతే హక్కు ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌పై తమకు పదేళ్లపాటు హక్కు ఉందని తేల్చిచెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన చట్టంలోని అన్ని అంశాలు తనకు తెలిసే జరిగినవని చెప్పిన కేసీఆర్...ఇపుడు సెక్షన్ 8పై ఎందుకు మాటలు చెప్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ పై తెలంగాణకంటే తమకే ఎక్కువ అధికారం ఉందన్నారు. హైదరాబాద్ కు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఈ విషయంలో టీఆర్ఎస్, తెలంగాణవాదులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం సైతం సెక్షన్ 8 ఇందుకోసం విధించిన విషయం మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు

రాష్ర్టం విడిపోయినా....తాము హైదరాబాద్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నామని ముద్దుకృష్ణమ చెప్పారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులు వేల కోట్ల పన్నులు తెలంగాణ సర్కారుకు చెల్లిస్తున్నారన్నారు. ఆయా పన్నుల్లో ఏపీకి వాటా ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయంలో కావాలంటే తాము పేచీ పెట్టుకోలేమా అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News