శ‌భాష్ గ‌ల్లా.. ఆంధ్రోళ్ల ఆవేద‌న చెప్పావ్‌

Update: 2018-02-08 04:57 GMT
ఇంత‌కాలానికి ఆంధ్రోళ్ల క‌డుపులో ఉన్న మంట లోక్ స‌భ సాక్షిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందుకు కార‌ణమైన ఏపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్న‌ట్లుగా ఆచితూచి మాట్లాడే తీరుకు పుల్ స్టాప్ పెట్టి.. నిల‌బెట్టి క‌డిగేసిన తీరులో మాట‌లతో విరుచుకుప‌డిన గ‌ల్లాజ‌య‌దేవ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

దాదాపు 14 నిమిషాల పాటు ఇంగ్లిషులో నాన్ స్టాప్ గా చేసిన ప్ర‌సంగంలో మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్‌.. మిస్ట‌ర్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అంటూ గ‌ద్దింపు స్వ‌రంతో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా మీరేం చేస్తున్నార‌న్న సూటిప్ర‌శ్న‌ను సంధించారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. ప‌రిమితులు పెట్టుకోకుండా.. ఉన్న విష‌యాన్ని ఉన్న‌ట్లుగా చెప్పేశారు. ఐదుకోట్ల ఆంధ్రోళ్ల మ‌న‌సుల్లో ఉన్న బాధ‌కు.. ఆవేద‌న‌కు ఆక్ష‌ర‌రూపాన్ని ఇచ్చార‌ని చెప్పాలి. లోక్ స‌భ‌లో ప్ర‌ధాని.. కేంద్ర ఆర్థిక‌మంత్రిని మాట‌ల‌తో బండ‌కేసి బాదేసిన‌ట్లుగా త‌న వాద‌న‌ను వినిపించిన గ‌ల్లా ప్ర‌సంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ మీ సంకీర్ణ భాగస్వాములకు మీరు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? మీ చేతిలో మోసపోయామని - అవమానాలకు గురవుతున్నామని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. ఐదుకోట్ల మంది ఏపీ ప్రజలూ అదే భావిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీలో టీడీపీని బలహీనపర్చి - మీరు (బీజేపీ) బలపడవచ్చని మీ పార్టీ నేతలు మీకు తప్పుడు సలహా ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు సలహాలతో ఉమ్మడి ఏపీని విభజించి - 2014 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది.

+ ఏపీ ప్రజలను మోసగించడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందాలని - రహస్య ఒప్పందంతో  ఏపీలోనూ అధికారం చలాయించవచ్చని కాంగ్రెస్‌ భావించింది - కానీ... ఏపీ ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. కాంగ్రెస్ పార్టీని  పూర్తిగా తుడిచిపెట్టేశారు. అలాంటి తప్పుడు వ్యూహాలను అనుసరిస్తే బీజేపీకి అంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడొద్దు

+కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ..టీడీపీ కానీ మోసపోయే జాబితాలో ఉండరు. గడిచిన నాలుగేళ్లలో మా ముఖ్యమంత్రి 29సార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని - ఆర్థిక మంత్రిని - ఇతర కేబినెట్‌ మంత్రులను కలిశారు. సవిరమైన నివేదికలు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రధానిని కలిసి సమగ్ర నివేదిక అందజేశారు. ఇంత చేసినా ఇంకా సమాచారం కావాలని కోరడం.. పరిశీలిస్తున్నామనడం సిగ్గుచేటు.

+  ఏపీ విభజన చట్టంలో 19 అంశాలు ఉన్నాయి. వాటిలో ఏపీకి ప్రత్యేక హోదా - రెవెన్యూ లోటు భర్తీ..  పోలవరానికి నిధులు.. రైల్వే జోన్‌.. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం.. గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌ ఫ్యాక్టరీ.. జాతీయ విద్యాసంస్థలు.. దుగరాజపట్నం ఓడరేవు...అసెంబ్లీ సీట్ల పెంపు వంటివి ఉన్నాయి. సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం కుద‌ర‌ని అంటే ప్యాకేజీకి ఒప్పుకున్నాం. రెండింటికి తేడా లేకుండా నిధులు వ‌చ్చేలా చూస్తామ‌ని ప్ర‌ధాని.. ఆర్థిక‌మంత్రి హామీ ఇచ్చారు. అందుకే నాలుగు బ‌డ్జెట్ల వ‌ర‌కు న‌మ్మ‌కంతో వెయిట్ చేశాం. ఇక ఆ అవ‌కాశం లేదు. చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ ఇదే. ఇక్క‌డే మీరు కేటాయింపులు చేయాల్సి ఉంది.

+ మీకు లోక్‌ సభలో సంఖ్యాబలం ఎక్కువుందని మాకు అర్థమవుతుంది. కానీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు గమనిస్తుంటారు. రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించిన కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు. మరి... ఆ చట్టంలోని అంశాలను కనీసం అమలు చేయని బీజేపీ సంగతి ఏమిటో ఆలోచించండి.

ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరునే కొన‌సాగిస్తే.. మీరు మా రాష్ట్రం ప‌ట్ల బ్యాడ్ ఫెయిత్ తో ఉన్నార‌ని భావించి.. ఈ బంధాన్ని ఎందుకు కంటిన్యూ చేయాల‌నే అంశంపై ఆలోచించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తుంది.మీరిప్ప‌టిదాకా సంకీర్ణ ధ‌ర్మాన్ని పాటించ‌లేదు. ఇదే చివ‌రి అవ‌కాశం. ఇప్పుడైనా పాటించండి. మిత్ర‌ప‌క్షం మ‌న‌సును గాయ‌ప‌రిచేలా మాట్లాడాల‌ని మాకు లేదు. కానీ.. మీరు మాకు అలాంటి ప‌రిస్థితి క‌ల్పించారు. ఈ విష‌యం మీద ప్ర‌ధాని.. ఆర్థిక మంత్రి స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే. చివ‌ర‌గా ఒక్క మాట‌.. ఏపీ ప్ర‌జ‌లు మూర్ఖులు కాదు.
Tags:    

Similar News