జైట్లీకి ఎదురు తిరిగిన గల్లా జ‌య‌దేవ్‌

Update: 2016-08-02 11:22 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటులోని ఉభ‌య‌స‌భ‌లు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. మ‌రో వైపు ఏపీలో ప్ర‌త్యేక హోదా వేడి రాజుకుంది. ఇక లోక్‌ స‌భ‌లో అన్ని పార్టీల ఎంపీలు క‌లిసిక‌ట్టుగా ప్ర‌త్యేక హోదా కోసం ఆందోళ‌న చేస్తున్నాయి. ఎన్డీయేలో మిత్ర‌ప‌క్షంగా ఉన్నామ‌న్న సంగ‌తి సైతం టీడీపీ ఎంపీలు మ‌రిచారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ మంత్రులు సైతం ఎన్డీయే స‌ర్కార్‌ పై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సోమ‌ - మంగ‌ళ‌వారాల్లో అయితే ఈ అంశం పార్ల‌మెంటును హీటెక్కించింది.

 మంగ‌ళ‌వారం లోక్‌ స‌భ‌లో ఏపీ ఎంపీలంద‌రూ పార్టీల‌కు అతీతంగా ఆందోళ‌న చేయ‌డంతో జీరో అవ‌ర్ త‌ర్వాత రెండుసార్లు స‌భ వాయిదా ప‌డింది. దీంతో కేంద్రం ఓ మెట్టు దిగి వ‌చ్చింది. రంగంలోకి దిగిన ఆర్థిక‌మంత్రి అరుణ్‌ జైట్లీ ఏపీ స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై తాను సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడ‌తాన‌ని, ఆయ‌న‌తో హోదా గురించి అన్ని విష‌యాలు చ‌ర్చిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

  ఏపీకి సాయం చేసే విష‌యంలో తాము కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌న్న జైట్లీ... విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి విషయాన్ని నెరవేరుస్తామని తెలిపారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌న్ని నెర‌వేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, అయితే అందుకు కొంత టైం కావాల‌ని ఆయ‌న చెప్పారు.

జైట్లీ ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న టైంలోనే గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టికే రెండేళ్లు ముగిశాయి...ఇంకెంత టైం కావాల‌ని...ఇంకెంత కాలం ఎదురు చూడాల‌ని ఆవేశంగా జైట్లినీ నిల‌దీశారు. దీంతో జైట్లీ స్పందిస్తూ ఈ అంశాల‌పై మీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చిస్తున్నాం...ఎంపీల ఆందోళ‌న అర్థం చేసుకుంటున్నామ‌ని చెప్పారు. ఏదేమైనా గ‌ల్లా జైట్లీకి ఎదురు తిరిగి గ‌ట్టిగా మాట్లాడ‌డంతో ఆయ‌న సైతం ఒకింత ఇబ్బంది ప‌డిన‌ట్టు క‌నిపించింది.


Tags:    

Similar News