నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె

Update: 2020-07-15 06:00 GMT
తెలంగాణలో కరోనా చికిత్సలు, నియంత్రణపై విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కు మరో పోటు ఏర్పడింది. తెలంగాణలో కరోనా చికిత్సలకు కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి నిరవధిక సమ్మె మొదలైంది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో చాలా మంది గాంధీలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇప్పటికే వైద్యసేవలు బాగా లేవని వస్తున్న విమర్శలకు తోడు గాంధీ ఆస్పత్రి సిబ్బంది సమ్మెతో మరింత దారుణమైన పరిస్థితులు కేసీఆర్ సర్కార్ చవిచూసేలా ఉన్నాయి.

అయితే ఈ విషయంలో ప్రభుత్వం, వైద్యాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని  కార్మిక సంఘాలు నిర్ణయించారు.

ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్ గా వీరంతా ఆందోళన చేపట్టారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్మానించారు. ఇక ఇప్పటికే తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు.ఇప్పుడు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెకు దిగడంతో మరింత ఇబ్బందులు గాంధీలో నెలకొన్నాయి.

కాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం, ఆస్పత్రి అధికారులు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేశారు.

ఇక వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో చనిపోయిన మృతదేహాలు బెడ్లపైనే పడి ఉన్నాయి. వాటిని మార్చురీకి తరలించకపోవడంతో దుర్వాసనతో వైద్యులు ఇబ్బందులు పడ్డారు. పారిశుధ్య లోపంతో 900 మంది కరోనా రోగులు అవస్థలు పడ్డారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం వీరి డిమాండ్లపై స్పందించలేదు. దీంతో గాంధీలో ఎన్ని దారుణాలు జరుగుతాయోనన్న భయం ఆందోళన రోగుల్లో నెలకొంది.
Tags:    

Similar News