సెకండ్ వేవ్ పై గాంధీ సూపరిండెంట్ నోట షాకింగ్ నిజాలు

Update: 2021-04-17 07:30 GMT
మొన్నటివరకు కరోనా పని అయిపోయిందని ధీమాగా చెప్పిన వారంతా ఇప్పుడు దాని బారిన పడి వణికిపోతున్నారు. నెలల తరబడి జాగ్రత్తలు తీసుకుంటున్న కుటుంబాలు సైతం పాజిటివ్ గా తేలుతున్నారు. ఎక్కడున్నా సరే.. ఏ చిన్న తప్పు దొర్లితే చాలు.. ఇట్టే వచ్చేస్తా.. నిన్ను పట్టేస్తా అన్న రీతిలో కోరలు చాస్తున్న కరోనా దెబ్బకు హడలిపోతున్నారు. కేసుల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన  గాంధీలో  బెడ్లు ఇప్పుడు నిండుతున్నాయి.

ఫస్ట్ వేవ్ లో కరోనా ట్రీట్ మెంట్ లో కీలక భూమిక పోషించిన గాంధీ.. సెకండ్ వేవ్ వేళ గురుతర బాధ్యతను నిర్వర్తిస్తోంది. పూర్తిస్థాయి సిబ్బందితో పాటు.. వైద్యులు దండిగా ఉన్న గాంధీలో బెడ్ల కొరత పెద్దగా లేదన్న మాట వినిపిస్తోంది. మార్కెట్ లో రెమ్ డెసివిర్ లాంటి మందులు దొరక్క విలవిలలాడుతుంటే.. గాంధీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని.. అన్ని మందులు పూర్తిస్థాయిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరత కూడా లేదని ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు స్పష్టం చేస్తున్నారు.

మొదటి దశకు.. రెండో దశకు మధ్యనున్న తేడాలతో పాటు.. కరోనా పేషెంట్లకు ఇస్తున్న ట్రీట్ మెంట్ విషయంపై ఆయన పలు కీలక అంశాల్ని వెల్లడించారు. అవేమంటే..

-  రెండో దశలోనూ పూర్తిస్థాయిలో వైద్యం అందించటానికి గాంధీ సిద్ధంగా ఉంది. ఆసుపత్రిలో 1850 పడకలు ఉన్నాయి. వీటిల్లో 500 ఐసీయూ.. 750 ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి. మిగిలినవి సాధారణ పడకలు. 1250 మంది రోగుల్ని చేర్చుకునే వీలుంది. అవసరమైతే.. ఓపీలో ఉన్న 200 పడకల్ని ఉపయోగిస్తాం.

-  మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో ఆసుపత్రిలో వైద్యం అందించాల్సిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది వంద మంది వస్తే.. 20 మందిని ఆసుపత్రిలో చేర్చేవాళ్లం. ఐదారుగురు ఐసీయూలో చేరేవారు. ఈసారి వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వంది మంది వస్తే యాభై మంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజా వైరస్ లో వేగంగా విస్తరించే గుణం కనిపిస్తోంది. ప్రమాదకరమని చెప్పలేం కానీ.. సకాలంలో వైద్యసేవలు అందితే పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు.

-  సాధారణ కేసుల్ని గాంధీలో చేర్చుకోలేం. అలా చేస్తే.. సీరియస్ గా ఉన్న వారిని వైద్య సాయం అందించలేం. ఎందుకంటే.. ఐసీయూ.. ఆక్సిజన్ అందించే పేషెంట్లు దశల వారీగా సాధారణ పడకలకుమార్చి అనంతరం ఇంటికి పంపిస్తున్నాం.

-  గాంధీలో వైద్యులు.. సిబ్బంది కొరత లేదు. వైద్యులు.. వైద్య సిబ్బంది.. వైద్య కళాశాల సిబ్బంది.. మొత్తంగా 2900 మంది ఉన్నారు. ఒక్కో షిఫ్టులో ఒక్కో బ్లాక్ లో 30 మంది వైద్యులు.. 50 మంది నర్సులు.. ఇతరత్రా సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఏ ఆసుపత్రిలో లేనట్లుగా 24 గంటలూ వైద్యం అందుతుంది.
Tags:    

Similar News