అవును.. లడ్డూ రూ.కోట్లు కొల్లగొట్టింది

Update: 2015-09-28 04:57 GMT
గణనాథునికి అరచేతిలో ఉంచి.. ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూ లక్షలాది రూపాయిలు పలికాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా.. గణనాథుని చేతిలో ఉంచే లడ్డూను వేలంపాటను నిర్వహించటం తెలిసిందే. ఈ లడ్డూను అత్యధిక మొత్తం చెల్లించిన వారు సొంతం చేసుకోవటం మామూలే.

గత కొద్ది సంవత్సరాలుగా ఈ లడ్డూను చేజిక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేయటానికి వెనుకాడని పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రసాదంగా పెట్టిన లడ్డూను వేలం పాటలో చేజిక్కించుకునేందుకు ఖర్చు చేసిన మొత్తం ఎంత ఉంటుందనే లెక్క వేస్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. ఒక అంచనా ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాలలో లడ్డూ వేలం పాట ద్వారా చేతులు మారిన సొమ్ము కనిష్ఠంగా రూ.15 కోట్ల నుంచి రూ.25కోట్ల మధ్య వరకు ఉంటుందని అంచనా.

పోలీసుల రికార్డుల్లో నమోదు చేసుకొని అనుమతి ఇచ్చిన మండపాలు దాదాపుగా 30 వేల పైనే ఉంటాయని చెబుతున్నారు. ఈ మొత్తం మండపాల్లో ఐదు వేల మండపాలు మినహాయించి.. 25వేల మండపాల్లో ప్రసాదంగా పెట్టిన లడ్డూను కనీస మొత్తం రూ.5వేలుగా లెక్క వేస్తే.. 12.5కోట్లుగా చెప్పొచ్చు. ఇదంతా అనధికారికంగా చెప్పాలి. వీధుల్లోనూ.. చిన్నచిన్న కాలనీల్లోనూ ఏర్పాటు చేసిన గణేషుడి మండపాల్లో పెట్టిన లడ్డూను వేలంలో చేజిక్కించుకోవటానికి ఎంతకైనా రెఢీ అనే వారు చాలామందే. అలాంటి మొత్తాన్ని లెక్కేయకుండానే రూ.12.5కోట్ల వరకూ వచ్చే పరిస్థితి.

గ్రేటర్ పరిధిలో అత్యధిక ధర పలికిన వినాయక లడ్డూ లెక్కలోకి వెళితే.. తొలి స్థానం కూకట్ పల్లిలో జరిగిన వేలం పాటగా చెప్పాలి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేషుడి లడ్డూ ఏకంగా రూ.15లక్షలు పలికింది. ఆ తర్వాత స్థానంలో మధురా నగర్ లో రూ.10.4లక్షలు పలకగా.. బాలాపూర్ లడ్డూ వేలం రూ.10.32లక్షల వరకే పరిమితమైంది.

ఇక బడంగ్ పేట రూ.6.5లక్షలు.. అత్తాపూర్ రూ.3.3లక్షలు.. తూర్పు ఆనంద్ బాగ్ రూ.2.5లక్షలు.. నిజాంపేట రూ.2లక్షలు.. అత్తాపూర్ రూ.1.35లక్షలు.. మూసాపేట రూ.1లక్ష పలికినట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ మీడియా లెక్కల్లోకి వచ్చినవి. కొన్ని ప్రాంతాల్లో మీడియా వరకూ సమాచారం అందని లడ్డూ వేలం పాటలు భారీగానే సాగినట్లు చెబుతున్నారు. చిన్న చిన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాట రూ.50 నుంచి రూ.75వేల వరకూ వెళ్లిందని పలువర్గాలు చెబుతున్నాయి.

వేలంపాట వ్యక్తిగత ప్రతిష్ఠగా భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే లడ్డూ వేలంపాట ఇంత భారీగా పెరగటానికి కారణమని చెప్పొచ్చు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోని లడ్డూ వేలంపాటల పుణ్యమా అని కోట్లాది రూపాయిలు చేతులు మారాయని చెప్పక తప్పదు. వేలంపాటలో వెనుకా ముందు చూసుకోకుండా పాడేసేవారు కొందరు తర్వాత ఐటీ లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మాట కూడా వినిపిస్తోంది.
Tags:    

Similar News