అంత చిన్న కారణానికి వేములవాడలో గ్యాంగ్ వార్

Update: 2020-06-22 07:10 GMT
చిన్న కారణాలు పెద్ద గొడవలకు కారణమవుతున్నాయి. మొన్నటి బెజవాడ గ్యాంగ్ వార్ చూసినా.. ఈ మధ్యన హైదరాబాద్ శివారులో కత్తులతో జరిగిన గ్యాంగ్ వార్ చూసినా.. ఆర్థిక లావాదేవీలు.. భూ వివాదాలే కారణంగా కనిపిస్తాయి. ఇందుకు భిన్నంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఒక చిన్న కారణానికి.. రెండు వర్గాలుగా తయారై ఇష్టారాజ్యంగా కొట్టుకున్న వైనం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ప్రజల్ని విపరీతంగా భయపెట్టింది.

రోడ్డు మీద టూ వీలర్ మీద అమితమైన వేగంతో వెళుతున్న ఒక యువకుడ్ని అక్కడి వారు మందలించారు. అంత వేగంతో వెళతావా? అంటూ ప్రశ్నించటమే కాదు.. మరోసారి అలా జరిగితే చర్యలు తప్పవని చెప్పారు. దీంతో.. ఆగ్రహానికి లోనైన సదరు కుర్రాడు తన గ్యాంగ్ ను తీసుకొచ్చాడు. అంతే.. క్షణాల్లో అక్కడ పరిస్థితి రణ రంగంగా మారి పోయింది. ఒకరి పై ఒకరు కొట్టుకుంటూ.. ముష్టి ఘాతాలు విసురుకుంటూ.. అందుబాటు లో ఉన్న రాళ్లతో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు.

ఇదంతా చూసిన స్థానికులు వారిని విడదీసే ధైర్యం చేయలేదు. ఇక.. పోలీసులు సైతం వారి వీధి పోరాటాన్ని వీడియోలో చిత్రీకరించారు. దాదాపు20 నిమిషాల పాటు సాగిన ఈ గొడవను సర్ది చెప్పేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అవసరమయ్యారు. పోలీసు ఫోర్సు భారీగా రంగంలోకి దిగిన తర్వాత కానీ... పరిస్థితి అదుపులోకి రాలేదని చెబుతున్నారు. చిన్న విషయాలకే గ్యాంగ్ వార్ లకు తెర తీసే ఈ తరహా సంప్రదాయానికి తొలుతే చెక్ పెట్టాలని.. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని విపరిణామాలకు తావిచ్చే అవకాశం ఉందంటున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 
Tags:    

Similar News