మిథాలీని తప్పించడంపై దాదా హాట్ కామెంట్

Update: 2018-11-26 05:12 GMT
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో  భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మిథాలీరాజ్ ను అర్థంతరంగా తప్పించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.. దీనిపై ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తోపాటు టీం మేనేజ్ మెంట్  - బీసీసీఐపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో పాక్ - ఇంగ్లండ్ పై వరుసగా హాఫ్ సెంచరీ సాధించి మంచి ఫామ్ లో ఉన్న మిథాలీరాజ్ ను తప్పించడంపై తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పందించారు.

మిథాలీరాజ్ ను తప్పించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించారు. తనను కూడా బ్యాటింగ్ లో రాణిస్తున్న సమయంలోనే భారత జట్టు నుంచి తప్పించారని సౌరభ్ గుర్తు చేసుకున్నాడు. గతంలో కెప్టెన్ గా విజయవంతంగా కొనసాగినా.. నన్ను పెవిలియన్ లో కూర్చుండబెట్టారని,. మిథాలీని తప్పించిన తర్వాత అందరూ స్వాగతించారని.. ఓడాకే ఈ నిర్ణయంపై విమర్శలు చెలరేగాయని తెలిపారు.. జట్టు కెప్టెన్ కూర్చోమంటే కూర్చోవాల్సిందేనని.. ప్రపంచ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే తనను 15 నెలల పాటు వన్టే జట్టుకు దూరం చేశారని’ గంగూలీ తన పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రపంచంలోనే అద్భుతంగా ఆడుతున్న కొందరికీ ఇలానే తలుపులు మూసేస్తారని.. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలానే ఇంటికి పంపించారని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మిథాలీ అత్యుత్తమ క్రీడాకారిణి అని.. ఆమె కృషితో మరోసారి అవకాశం వస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిథాలీని తప్పించడం కంటే భారత్ మహిళల జట్టు ఓటమే బాధ కలిగించిందని.. ప్రపంచకప్ సాధిస్తారని కలలుగన్నానని . జీవితంలో ఎవ్వరికీ, దేనిపై గ్యారెంటీ లేదనడానికి ఇదే ఉదాహరణ అని గంగూలి పేర్కొన్నాడు.

కాగా దేశవ్యాప్తంగా మిథాలీని తప్పించడంపై విమర్శలు చెలరేగుతున్న వేళ.. దీనిపై బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) స్పందించింది. దీనిపై వివరణ కోరాలని ఆదేశించింది. భారత జట్టు స్వదేశం తిరిగివచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పవర్ , మేనేజర్ తృప్తి, సెలెక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం మాట్లాడడానికి నిర్ణయించింది.


Tags:    

Similar News