సీఎం వ‌ద్ద‌కు చేరిన గ‌న్న‌వ‌రం పంచాయ‌తీ.. ఏం చేస్తారు?

Update: 2022-05-19 07:01 GMT
దాదాపు ఏడాది కాలంగా న‌లుగుతున్న ఉమ్మ‌డి కృష్నాజిల్లా గ‌న్న‌వ‌రంనియోజ‌క‌వ‌ర్గం వైసీపీ పంచాయ‌తీ కి  శుభం కార్డు ప‌డుతుందా?  ఇక్క‌డ వైసీపీలో జ‌రుగుతున్న ఆధిప‌త్య హోరుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో ఎండ్ ప‌లుకుతారా?  ఇవీ.. ఇప్పుడు అధికార వైసీపీలో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు. ఎందుకంటే.. గన్నవరం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఆదిపత్య పోరు ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద‌కే చేరింది. ఈ రోజు ఆయ‌న ఇక్క‌డి నేత‌ల‌ను తాడేప‌ల్లికి పిలిపించుకున్నారు. దీంతో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

వంశీ రాక‌తో..

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి బ‌లమైన కేడ‌ర్ ఉంది. ఇక్క‌డ నుంచి ఆపార్టీ త‌ర‌ఫున వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. అయితే.. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరారు. కాగా, ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున ఆది నుంచి దుట్టా రామ‌చంద్రరావు.. కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పార్టీని నిల‌బెట్ట‌డం దగ్గ‌ర నుంచి కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డం వ‌ర‌కు కూడా ఆయ‌న వైసీపీలో కీల‌కంగా ఉన్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. ఆయ‌న గెలిచేందుకు.. దుట్టా ఎంతో శ్ర‌మించారు. అయితే.. యార్ల‌గ‌డ్డ ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న విధంగా చంద్ర‌బాబు పాల‌నా కాలంలో.. తీవ్ర రాజ‌కీయ పోరు న‌డిచింది. వంశీ అంటే.. దుట్టా, యార్ల‌గ‌డ్డ‌ల‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. ఇక‌, వంశీ కూడా వీరిపై టీడీపీ హ‌యాంలో కేసులు పెట్టించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. అనూహ్యంగా టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత‌.. వంశీ వైసీపీ పంచ‌న చేరారు.

ఈ క్ర‌మంలో వంశీ రాక‌ను అటు దుట్టా.. ఇటు యార్ల‌గ‌డ్డ కూడా తీవ్రంగా వ్య‌తిరేకించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం వీరి వ్య‌తిరేక‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే వంశీని పార్టీలోకి తీసుకున్నారు. అప్ప‌టి నుంచి దుట్టా వ‌ర్సెస్ వంశీకి మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ విమ‌ర్శ‌లు.. ఆధిప‌త్య హోరు కొన‌సాగుతోంది. ఈ విష‌యం ఇప్ప‌టికే అనేక సార్లు పంచాయ‌తీకి కూడా వ‌చ్చింది.  వైసీపీ పెద్దలతో పాటు స్వయంగా సీఎం జగన్ ఎన్నిసార్లు మందలించారు. అయినా.. వీరి మధ్య విబేధాలు ఏమాత్రం సమసిపోవటంలేదు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల వంశీ.. వైసీపీ నాయ‌కుల‌పై ముఖ్యంగా దుట్టాపైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌ను నైతికంగా దెబ్బ‌తీసేందుకు ప‌నిచేస్తున్నార‌ని.. రాజ‌కీయంగా కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని.. త‌న‌కు ముప్పు ఉంద‌ని.. ఆయ‌న గ‌న్న‌వ‌రంపోలీసుల‌కు ఇచ్చిన కంప్ల‌యింట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం.. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోంద‌ని ఆరా తీసింది. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి కొడాలి నాని..ఇక్క‌డి విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ కు వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లికి వ‌ద్ద‌కు చేరిన గ‌న్న‌వ‌రం పంచాయ‌తీ. వారితో సీఎం జగన్ సమావేశం కానున్నారు.  ఇదిలా ఉంటే ఇటీవల గన్నవరం వైసీపీ ఇంచార్జ్‌ని నియమించాలని కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ఎన్నిక‌ల‌కు ముందు.. పార్టీకి సెగ‌పెడుతోంది. దీంతో జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు  దిగారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ సాధిస్తారో చూడాలి. ఇటీవ‌ల నెల్లూరు పంచాయ‌తీ(మంత్రి కాకాణి వ‌ర్సెస్ మాజీ మంత్రిఅనిల్‌) త‌ర్వాత‌.. గ‌న్న‌వ‌రం తెర‌మీదికి రావ‌డంతో వైసీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరుగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News