గంటా స‌న్ స్ట్రోక్‌ తో టీడీపీ ఎమ్మెల్యేల్లో వ‌ణుకు?

Update: 2017-07-02 05:05 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు స‌న్ స్ట్రోక్ త‌ల‌నొప్పులు మొద‌ల‌యిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. స‌న్ స్ట్రోక్ అంటే చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కార‌ణంగా కాదు. సీనియ‌ర్ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు త‌న‌యుడి వ‌ల్ల‌. విశాఖ జిల్లా రాజ‌కీయాల‌కు సంబంధించి గంటా త‌న‌యుడు చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మార‌డ‌మే కాకుండా టీడీపీలో క‌ల‌క‌లానికి దారి తీసింది. మంత్రి గంటా త‌న‌యుడు గంటా ర‌వి `జయదేవ్` సినిమాతో సినీ రంగంలోకి అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం విడుదల సందర్భంలో చోడవరంలో విఘ్నేశ్వరాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి తాను చోడ‌వ‌రం నుంచి రాబోయే ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌వ‌చ్చ‌నే అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

దైవ‌ద‌ర్శ‌నం అనంత‌రం గంటా తనయుడు రవితేజ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి అసెంబ్లీ నుండి పోటీకి దిగుతారా అని అక్కడి విలేఖరులు ప్రశ్నించగా తన తండ్రి ఇక్కడి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతంతో తనకు మంచి అనుబంధం ఏర్ప‌డింద‌న్నారు. తాను రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ నియోజకవర్గం పట్ల ఆసక్తి కనబరుస్తారని విలేఖరులు ఆరాతీయాగా చోడవరం ప్రాంతంపైనే తనకు మక్కువ ఎక్కువని, అటువంటి పరిస్థితి వస్తే ఇక్కడి నుండే పోటీకి దిగుతానని ప్ర‌క‌టించారు. గంటా తనయుడు చేసిన ప్రకటన ఆ నియోజకవర్గ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలకే దారితీసింది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కెఎస్‌ ఎన్ రాజు వచ్చే ఎన్నికల్లో తానే ఇక్కడి నుండి పోటీ చేస్తానని మరో ప్రకటన చేయాల్సి వచ్చింది. అదే విధంగా మంత్రి గంటా గతంలో అనకాపల్లికి విచ్చేసిన సందర్భంలో వచ్చే ఎన్నికల్లో అవసరమయితే తాను అనకాపల్లి నుండే పోటీకి దిగుతానని చేసిన ప్రకటన ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ను ఒకింత ఇరకాటానికి గురిచేసింది. రానున్న ఎన్నికల్లో ఇక్కడి ఎమ్మెల్యే పీలా గోవింద్ అనకాపల్లి నుండి ఎంపీగా వెళతారని ఇక్కడి ఎమ్మెల్యేగా ఎంపీ ముత్తంశెట్టి పోటీకి దిగుతారని అదే సందర్భంలో మంత్రి గంటా ప్రకటించారు. అందుకు ఎమ్మెల్యే పీలా లేదు తానే ఇక్కడి నుండి తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఖరాఖండిగా చెప్పారు. దీనిపై గంటా తిరిగి స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుండి తనను పోటీ చేయమంటారా అని విలేఖరులను ప్రశ్నించడంతో అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.

మ‌రోవైపు గంటాకు అత్యంత సన్నిహిత ప్రజాప్రతినిధులుగా మెలుగుతున్న ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జిల్లా దేశం పార్టీ అధ్యక్షులు - యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబులు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి ఏ విధంగా పోటీకి దిగాలనే విషయమై కూడా రసవత్తరమైన చర్చ సాగుతోంది. మంత్రి గంటా ఈ ఇరువురి నేతలకు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పించడంపై కూడా అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించవచ్చు. గత ఎన్నికల్లో పెందుర్తి నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల తరువాత ఎన్నికల్లో యలమంచిలి అసెంబ్లీకి మారిపోయారు. గతంలో భీమునిపట్నం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అవంతి శ్రీనివాసరావు తరువాత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా అధికారంలోకి వచ్చారు. అలాగే గంటా రాజకీయ రంగ ప్రవేశంతోనే అనకాపల్లి ఎంపీగా పోటీచేసి విజయం సాధించి తరువాత చోడవరం నుండి ఎమ్మెల్యేగాను, ఆ తరువాతి ఎన్నికల్లో తిరిగి అనకాపల్లి ఎమ్మెల్యేగాను విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో తనకు అత్యంత విధేయతగా మెలిగే భీమునిపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఒప్పించి ఆ స్థానంలోకి గంటా ఎమ్మెల్యేగా వెళ్లి విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. అందుకు ప్రతిఫలంగా అనకాపల్లి నుండి ముత్తంశెట్టికి ఎంపీ టిక్కెట్ ఇప్పించి ఆయన విజయం సాధించడంలోను గంటా సఫలీకృతులయ్యారు. ఇంతవరకు జరిగిన ఈ రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటున్న జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతల్లో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకునే రాజకీయ భవిష్యత్ నిర్ణయం ఎవరి కొంప ముంచుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మొత్తంగా ఏక‌కాలంలో గంటాతో ఆయ‌న త‌న‌యుడితో టికెట్ కోసం తాము పోరాడాల్సి వ‌స్తోంద‌ని టీడీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News