టీడీపీ ఎమ్మెల్సీపై గంటా ఆగ్ర‌హం

Update: 2017-05-25 11:30 GMT
తెలుగుదేశం పార్టీ నాయ‌కుల నోటి దురుసు, వాటిని సరిదిద్దేందుకు పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల ప్ర‌య‌త్నం వంటి ఎపిసోడ్‌లో మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మ‌హానాడును నిర్వ‌హించేందుకు విశాఖ‌లోని ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణాన్ని వేదికగా ఎంపిక చేసిన టీడీపీ వేగంగా పనులు చేసుకుంటూ దూకుడుగా ముందుకు పోతోంది. అయితే విశ్వ‌విద్యాల‌య్యాల్లో ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌ను నిషేధించిన తెలుగుదేశం స‌ర్కారు తమ అవ‌స‌రాల కోసం మాత్రం యూనివ‌ర్సిటీల‌ను వాడుకోవ‌డం వివాదంగా మారింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి సీన్‌ లోకి ఎంట్రీ ఇచ్చి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఆంధ్రా యూనివర్శిటీని దయ్యాల కొంపగా మారింద‌ని, అలాంటి దాన్ని మ‌హానాడు కోసం ఉప‌యోగించుకుంటే త‌ప్పేముంద‌ని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాఖ్యానించారు. ఏపీలో పేరెన్నిక‌గ‌న్న ఆంధ్రా యూనివర్శిటీపై మూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు త‌మ ప‌విత్ర విద్యాల‌యాన్ని దయ్యాల కొంపగా అభివర్ణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో ర్యాలీ నిర్వహించి, మూర్తిదిష్టిబొమ్మను దగ్ధం చేసి విద్యార్థులు నిరసనను తెలిపారు. సొంత సంస్థను ప్రమోట్‌ చేసుకునేందుకు ఏయూ ప్ర‌తిష్ట‌నును మ‌స‌క‌బార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ విద్యార్థులు మండిపడ్డారు.

కాగా యూనివర్శిటీని దయ్యాల కొంపగా అభివర్ణించిన ఎమ్మెల్సీ తీరుపైనా విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూర్తి చేసిన వ్యాఖ్యలు ఏయూ విద్యార్థులను కించపరిచేలా ఉన్నాయని గంటా త‌ప్పుప‌ట్టారు. ఎంతో ఘన చరిత్ర క‌లిగిన ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యం గురించి అలా మాట్లాడటం సరికాదని, వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు దానికి మంత్రి ఘాటు కౌంట‌ర్ ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News