పవన్ టూర్‌ కు గంటా హెల్ప్

Update: 2018-05-21 09:24 GMT
చంద్రబాబు కేబినెట్లోని మంత్రి గంటా శ్రీనివాసరావును మొదటి నుంచి ఎందుకో చాలామంది అనుమానంగా చూస్తుంటారు. ఆయన చంద్రబాబు కంటే చిరంజీవికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తారని.. మెగా హీరోల సినిమా కార్యక్రమాల నుంచి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన యాక్టివ్‌ గా ఉంటారన్న పేరు. అయితే.. ఇంతకాలం పవన్ - చంద్రబాబుల దోస్తీ ఉండడంతో ఇదంతా పెద్ద విషయంగా మారలేదు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గంటా తీరు వివాదాస్పదమవుతోంది. టీడీపీ పెద్దలు గంటాను ఓ కంట కనిపెడుతున్నారని వినికిడి.
    
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ రెండు రోజుల కిందట విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి టీడీపీలో చర్చనీయాంశమైంది. పవన్‌ కల్యాణ్ పర్యటన సందర్భంగా గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరులంతా హడావుడి చేశారట. పవన్ ఉత్తరాంధ్ర యాత్ర ఏర్పాట్లపై విశాఖలో చర్చలు జరిపినప్పుడు అందులో గంటా అనుచరులే కీలక పాత్ర పోషించారట.  పవన్‌ బస చేసిన హోటల్‌ కు వెళ్లి ఏర్పాట్లను గంటా అనుచరులు పర్యవేక్షించారట కూడా. దీంతో ఆ విషయాన్ని విశాఖ టీడీపీ నేతలు పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లారు.
    
మరోవైపు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌ లో ఉన్నారని జనసేన వర్గాలు కూడా తరచూ చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ టచ్‌ లో ఉన్నది గంటాయేనా అన్న అనుమానాలు టీడీపీ పెద్దల్లో వ్యక్తమవుతున్నాయట. అందుకు కారణాలూ, ఉదాహరణలు కూడా చెబుతున్నారు. తొలి నుంచి  చిరంజీవి కుటుంబంతో గంటాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అంతేకాదు.. పవన్ చంద్రబాబు - లోకేశ్‌ లపై తీవ్ర విమర్శలు చేస్తుంటే అందుకు ప్రతిగా ఏపీ మంత్రులంతా విమర్శలు చేస్తున్నారు. గంటా మాత్రం నోరు విప్పడం లేదు. వీటన్నిటినీ కలిపి విశాఖ టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు, లోకేశ్‌ ల వరకు తీసుకెళ్లినట్లు సమాచారం.
Tags:    

Similar News