స‌న్నిహితుడే బాబును ఇరుకున ప‌డేశాడే

Update: 2017-06-14 09:22 GMT
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు భారీ లుక‌లుక‌లు కాంగ్రెస్ పార్టీలో మామూలే. ప‌వ‌ర్ లో ఉన్న ప్ర‌తిసారీ.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఆ వృద్ధ పార్టీలో మామూలే. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలోనే ఏపీ అధికార‌ప‌క్షం తెలుగుదేశం పార్టీలోనూ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. బాబు లాంటి శ‌క్తివంత‌మైన అధినేత చేతిలో అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ్ముళ్లు ఎవ‌రికి వారుగా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం కొత్త ప‌రిణామంగా చెప్పాలి.

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. విభేదాలు పార్టీ గీత‌ను దాటి బ‌య‌ట‌కు రావ‌ట‌మేకాదు.. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు సైతం నేత‌లు వెనుకాడ‌క‌పోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. నిన్న‌టికి నిన్న ఎంపీ నాని ఏపీ ర‌వాణా శాఖ అధికారుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌భుత్వ స‌మ‌ర్థ‌త‌ను బ‌జార్లో పెడితే.. తాజాగా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడైన గంటా శ్రీనివాస‌రావు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ‌కు చెందిన మ‌రో మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడికి.. మంత్రి గంటాకు మ‌ధ్య‌నున్న అధిప‌త్య పోరు అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. అయ్య‌న్న‌పాత్రుడి తీరుతో పార్టీకి.. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని గంటా తాజాగా ఆరోపించారు.  విశాఖ ఉత్స‌వ్‌.. ల్యాండ్ పూలింగ్‌.. చంద్ర‌న్న సంక్రాంతి కానుకల‌ ప‌థ‌కాల‌పై అర్థం లేని ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌భుత్వాన్ని మంత్రి అయ్య‌న్న‌ ఇరుకున పెట్టారని గంటా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విశాఖ‌లో ఇటీవ‌ల వెలుగు చూసిన భూ కుంభ‌కోణంలో టీడీపీ నేత పాత్ర ఉంద‌ని కేబినెట్లో ఉన్న‌ అయ్య‌న్న ఆరోప‌ణ‌లు చేయ‌డం పార్టీ ఇమేజ్ ను పాడు చేశాయ‌ని  గంటా  వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం మీద ప్ర‌తిప‌క్ష నేత‌లు విరుచుకుప‌డేలా అయ్య‌న్న‌పాత్రుడి మాట‌లు ఊతం ఇచ్చేలా ఉన్నాయ‌ని గంటా చెప్పారు. అయ్య‌న్న తీరు ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

అయ్య‌న్న తీరును త‌ప్పు పట్ట‌డం ఓకే గానీ.. గంటా చేసిన వ్యాఖ్య‌లు సైతం అధినేత‌కు ఇబ్బందిక‌రంగా మార‌తాయ‌న్న విష‌యాన్ని గంటా ఎందుకు గుర్తించ‌న‌ట్లు? అన్న ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఆధిప‌త్య పోరులో ప్ర‌త్య‌ర్థిని దెబ్బేయ‌టానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకునే క్ర‌మంలో పార్టీని ఇరుకున పెట్టేందుకు సైతం గంటా వెన‌క్కి త‌గ్గ‌ని వైనం చూస్తే.. సొంత లాభం త‌ర్వాతే పార్టీ ఇమేజ్ అన్న‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క  త‌ప్ప‌దు. పార్టీ ఎలా పోయినా ఫ‌ర్లేద‌న్న‌ట్లుగా గంటా లాంటి వారు లేఖల రూపంలో ర‌చ్చ‌కెక్క‌టం బాబుకు ఇబ్బందిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News