ప‌వ‌న్ హెచ్చ‌రిక‌తో గంటా రంగంలోకి దిగాడు

Update: 2017-03-07 10:01 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ప్ర‌భుత్వానికి మొర పెట్టుకోవ‌డం కంటే జ‌నసేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ దృష్టికి  తీసుకుపోవ‌డం మేలు అనే టాక్ వినిపిస్తోంది. ద‌శాబ్దాల‌ త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాని ఉద్దానం కిడ్నీ రోగుల స‌మస్య‌లు కావచ్చు,  ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న విద్యార్థుల స‌మ‌స్య‌లు కావ‌చ్చు ప్ర‌భుత్వం కంటే ప‌వ‌న్ ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. చిత్రంగా ప‌వ‌న్ ఆ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌డమే లేటు అన్న‌ట్లుగా ఏపీ ప్ర‌భుత్వం రంగంలోకి దిగుతోంది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి.
 
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెల‌కొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ కొంద‌రు విద్యార్థుల బృందం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విద్యార్థుల బృందం పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు కాలినడకన నెల్లూరు నుంచి బయలుదేరి...విజ‌యవాడ వరకు రాగానే కొందరు అస్వస్తతకు గురయ్యారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యను తెలుసుకుని చలించిన పవన్... వారందర్నీ హైదరాబాద్‌ రావాల్సిందిగా ఆహ్వానించారు. హైదరాబాద్‌ లోని రామోజీ ఫిలింసిటీలో కాటమరాయుడు సినిమా షూటింగ్‌ లొకేషన్‌ లో వారంద‌రినీ పవన్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా విశ్వవిద్యాలయంలో ఇబ్బందులను విద్యార్థులు పవన్‌కు వివరించారు. విద్యాలయంలో నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని, తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విద్యార్థులు పవన్‌ కు తెలిపారు. విద్యాలయంలో అక్రమాలపై పత్రికల్లో కథనాలు, పరిశోధించి రూపొందించిన నివేదికలను పవన్‌ కు అందజేశారు. విద్యార్థుల సమస్యలపై పవన్ స్పందించి విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నెల్లూరు నుంచి  పాద‌యాత్రగా వ‌చ్చే ప‌రిస్థితులు రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఆ యూనివ‌ర్సిటీలో నెల‌కొన్న‌ సమస్యల పరిష్కారానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లూరు వర్సిటీ సమస్యలపై దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ కోరారు.

సీన్ క‌ట్ చేస్తే...నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌ల‌ర్ స‌హా అధికారుల‌తో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తాజాగా స‌మావేశ‌మ‌య్యారు. యూనివ‌ర్సిటీల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అక్ర‌మ నియామ‌కాల‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యారంగంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై పవన్ కల్యాణ్ దృష్టిసారించే ప‌రిస్థితి ఎందుకు తీసుకువ‌చ్చారని ఆగ్ర‌హించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కీల‌క‌మైన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఉండ‌గా నెల్లూరుకు వెళ్లి మ‌రీ గంటా స‌ద‌రు స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నాడంటే... ప‌వ‌న్ ఎఫెక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదే రీతిలో ఇక ఏపీలో ఏ స‌మ‌స్య అయినా పాల‌కుల దృష్టికి తీసుకుపోయేకంటే ప‌వ‌న్ వ‌ద్దకే  వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News