జూనియర్ గంటా రాజకీయ అరంగేట్రం... ధూం ధాం గానే

Update: 2022-10-31 02:30 GMT
ఆయన టీడీపీలో సీనియర్ నేత. మాజీ మంత్రి. ఎంపీగా ఒక సారి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనే గంటా శ్రీనివాసరావు. పుట్టింది ప్రకాశం జిల్లా అయినా విశాఖలో స్థిరపడ్డారు. అక్కడ నుంచే పాలిటిక్స్ చేస్తూ విశాఖ వాసి అయిపోయారు. ఆయన రెండున్నర దశాబ్దాల రాజకీయం  అలా అన్ స్టాపబుల్ గా కొనసాగుతోంది. పార్టీలు మార్చినా నియోజకవర్గాలు మార్చినా జెండా ఏది అయినా గంటా మాత్రం గెలిచి తీరుతారు. అది పక్కా నిజం. గంటాకు ఓటమి లేదు. ఆయన అజేయుడు. అలాగే మంచి రాజకీయ వ్యూహకర్త.

అలాంటి గంటా కొన్నాళ్ళుగ సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎందుకు అలా ఉన్నారు అన్నది అందరినీ పట్టి పీడిస్తున్న ప్రశ్న. అనుచరులు కూడా ఒక దశలో కలవరపడుతున్న నేపధ్యం ఉంది. అయితే గంటా మౌనం వెనక బ్రహ్మాండమైన ప్లాన్ ఉందని ఇపుడు మెల్లగా అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ  తన రాజకీయ వారసుడిగా ఏకైక కుమారుడు గంటా రవితేజాను వచ్చే ఎన్నికల్లో బరిలోకి ఆయన దింపబోతున్నారు అని తెలుస్తోంది.

తాజాగా ఆదివారం విశాఖలో జరిగిన గంటా రవితేజా బర్త్ డే ధూం ధాం గా సాగిపోయింది. గంటా అనుచరులు చాలా కాలం తరువాత బయటకు వచ్చి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విశాఖ నుంచి అనకాపల్లి దాకా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అదరగొట్టారు. దీన్ని చూసిన వారు రవితేజా పొలిటికల్ అరంగేట్రానికి ఇది సంకేతం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే గంటా తనయుడు అనకాపల్లి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. 2009 ఎన్నికల్లో గంటా అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన చిరకాల కోరిక అయిన మంత్రి పదవి కూడా ఆ ఎమ్మెల్యే సీటు తోనే దక్కింది. దాంతో గంటాకు లక్ అయిన అనకాపల్లి నుంచే కొడుకుని కూడా పోటీలోకి దింపుతారు అని అంటున్నారు. ఇక గంటా రవితేజా రాజకీయ అరంగేట్రం అంటే ఏ పార్టీ అన్న చర్చ కూద్డా ముందుకు వస్తోంది.

అయితే గంటా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉండి కుమారుడిని జనసేనలోకి పంపిస్తారు అని అంటున్నారు. ఆ పార్టీ పటిష్టతకు ఆయన పనిచేస్తారు అని ఒక ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే టీడీపీ నుంచే రవితేజ పోటీ చేయవచ్చు అని కూడా అంటున్నారు. అయితే టీడీపీ అంటే అనకాపల్లిలో పెద్ద పోటీ ఉంది కాబట్టి జనసేన అనే ఫిక్స్ అవుతున్న వారూ ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం గంటా మార్క్ వ్యూహం రెడీ అయింది అని మాత్రం అంతా అంటున్నారు.
Tags:    

Similar News