బాబుపై గ‌రిక‌పాటి ప్రేమ‌..టీ ఉప‌ముఖ్య‌మంత్రి అస‌హ‌నం

Update: 2017-12-16 16:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు హైద‌రాబాద్‌ కు ప్ర‌త్యేక వ‌న్నె తెస్తుండ‌గా...మ‌రోవైపు రాజ‌కీయ ప‌ర‌మైన విభేదాల‌ను సైతం తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తెలుగు మ‌హాస‌భ‌ల ఆహ్వానాల‌ జాబితాలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పేరు లేక‌పోవ‌డం హాట్ టాపిక్‌ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ...ప్రపంచ తెలుగు మహా సభకు సంబంధించి తనకు ఆహ్వానం రాకపోయినా పర్వాలేదన్నారు.అయితే ఇప్పుడీ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది.

ప్ర‌ముఖ స‌హ‌స్ర అవ‌ధాని గరికపాటి నరసింహారావు ఈ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా అనూహ్య రీతిలో స్పందించారు. "తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు ఆంధ్రకు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను`` అంటూ మీడియాకు వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో బృహత్ కవి సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గ‌రికపాటి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఐదు రోజుల కార్య‌క్ర‌మాల‌ను డాక్యుమెంటరీగా తయారు చేస్తామ‌ని రాబోవు తరాలకు అందిస్తామ‌ని అన్నారు. స్వచ్ఛమైన తెలుగు తెలంగాణదేన‌ని కడియం శ్రీహరి స్ప‌ష్టం చేశారు. అమెరికా ఆటా సభల్లో పాల్గొన్న సంద‌ర్భంగా గరికపాటి అచ్చమైన తెలుగు తెలంగాణ ప్రజలు మాట్లాడతారు అని చెప్పారని ఈ సంర‌ద్భంగా గ‌తం గుర్తుకు చేశారు. తెలంగాణ భాషను - యాసను అవమానపరిచిన ఈ ప్రాంతంలోనే తెలుగు ప్రపంచానికి చాటి చెప్పాలన్న‌ సీఎం కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదని ఆయ‌న వ్యాఖ్యానించారు. పల్లె బాషా, సాహిత్యం - పాటలు కనుమరగు అయ్యాయ‌ని పేర్కొంటూ వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌ని ఆయ‌న అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం - తెలంగాణ ఉద్యమంలో బాషా ఎంతో ఉపయోగప‌డిందని ఉప‌ముఖ్య‌మంత్రి తెలిపారు.

కాగా, హైదరాబాద్‌ లో కానీ మరెక్కడైనా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినా టీడీపీ సంఘీభావం తెలియ చేస్తుందని ఇందులో వివాదం లేదని ఏపీ  సీఎం చంద్రబాబు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగును అందరూ గౌరవించాలని, కలిసికట్టుగా భాషను ముందుకు తీసుకెళ్లాలని బాబు కోరారు. తెలుగు భాష కోసం ఎటువంటి కార్యక్రమాలు జరిగినా టీడీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా.. కలిసి ఉండాలనేదే టీడీపీ ఆకాంక్షగా చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News