ఆ ఇద్దరు సీఎంలకు వెల్లుల్లి భయం

Update: 2018-11-06 14:42 GMT
ఒకప్పుడు ఉల్లి ధరలు విపరీతంగా పెరిగి బీజేపీ అధికారం కోల్పోవడానికి కారణమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రల్లో బీజేపీని వెల్లుల్లి భయపెడుతోంది. అయితే, ఈసారి ధరలు పెరగడం వల్ల కాదు.. ధర లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వాలకు వెల్లుల్లి ఘాటు తగులుతోంది.
   
ఒకప్పుడు ఉల్లి పంట ధరల కారణంగా మహారాష్ట్రలో - ఢిల్లీలో ప్రభుత్వాలు  పతమయ్యాయి. ఇప్పుడు వెల్లుల్లి ధరలు మధ్యప్రదేశ్ - రాజస్థాన్ ప్రభుత్వాలకు కంటనీరు  పెట్టిస్తున్నాయి. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు - దక్షిణాదిలో తెలంగాణకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. వెల్లుల్లి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం ఆయా ప్రభుత్వాలకు పెను సవాల్ గా  మారింది. వెల్లుల్లి వ్యవసాయంలో సంక్షోభాన్ని ఆయుధంగా చేసుకుని బిజెపితో కాంగ్రెస్ పార్టీ తలపడుతూ ఉంది. 2014లో బీజేపీ మహానేత నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాల్లో దేశంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని - అన్ని పంటలకూ గిట్టుబాటు ధరలు అందేటట్లు చూడడమే కాక - ఉచిత బీమా తో పాటు  సాగునీరు కల్పన - ఇతర సౌకర్యాలు కల్పించి వ్యవసాయరంగానికి పరిశ్రమలతో సమానమైన హోదా కల్పిస్తామని ఎన్నో ఆశలు చూపారు. కొన్ని దశాబ్దాలుగా ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక - కాంగ్రెస్ సర్కార్ విధానాలతో విసిగి వేసారిన రైతాంగం ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా రైతాంగం మోదీకి అండగా నిలవడంతో అనూహ్యమైన మెజారిటీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. వివిధ రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. జరిగింది మాత్రం నామమాత్రమే. బీమా వంటి పథకాలు తప్ప - రైతాంగానికి గిట్టుబాటు ధర లభించనే లేదు.
   
ఇప్పుడు  ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ - రాజస్థాన్ రాష్ట్రాలలో గిట్టుబాటు ధరలేక వెల్లుల్లి పండించే రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ఒకప్పుడు కిలో 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకూ అమ్ముకున్న వెల్లుల్లి రైతులు అదే వెల్లుల్లిని ఇప్పుడు నాలుగైదు  రూపాయలకు కిలో అమ్ముకోక తప్పని దుర్భర పరిస్థితి ఏర్పడింది.  ఫలితంగా ఎందరో వ్యవసాయదారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వెల్లుల్లి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేని రాజస్థాన్ లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరీ దారుణంగా పడిపోతున్న వెల్లుల్లి ధరలు - వ్యవసాయ దారుల ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
   
మధ్యప్రదేశ్ లో ఏడాదిగా వెల్లుల్లి రైతులు ఆందోళన చేస్తున్నారు. 2017లో మాంద్సోర్ లో రైతుల ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. పోలీసులు కాల్పులు జరిపారు. అయిదారుగురు చనిపోయారు. మాంద్సోర్ ఆందోళన కారణం వెల్లుల్లి ధరలు పడిపోయి రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే.  దేశంలో ఉత్పత్తి అయ్యే వెల్లుల్లిలో 50 శాతం మధ్యప్రదేశ్ - రాజస్థాన్ రాష్ట్రాలలోనే ఉత్పత్తి అవుతుంది.  వెల్లుల్లి సాగు విస్తీర్ణంలోనూ రెండు రాష్ట్రాలదే పైచేయి. రెండేళ్ల నుంచి   సాగు విస్తీర్ణం కూడా బాగా పెరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్‌ లో 92 వేల హెక్టేర్ల నుంచి  లక్షా 28 వేల హెక్టార్లకు  - రాజస్థాన్ లో 69 వేల నుంచి  లక్షా 32 వేల హెక్టార్లకు  వెల్లుల్లి సాగు పెరిగింది. దీనితో  ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు కుప్పకూలిపోయాయి. మాంద్సోర్ ప్రాంతంలో  2018 మే నెల నాటికి కిలో వెల్లుల్లి ధర దారుణంగా పతనమై రూపాయికి చేరుకుంది.  ఆ తర్వాత ధర కొంత పుంజుకున్నప్పటికీ మళ్లీ రైతులు కోలుకోలేదు.
   
రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్కడి ఇతర విపక్షాలూ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. అందులో భాగంగా  తాము అధికారంలోకి వస్తే, రైతులకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని రైతులకు గిట్టు బాటు ధరలు కల్పిస్తామని ఆశలు చూపుతూ - తాము లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో రాజస్థాన్ - మధ్యప్రదేశ్‌ లలోని వసుంధర రాజె - శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలు వెల్లుల్లి భయంతో వణుకుతున్నాయి.


Tags:    

Similar News