అర్థరాత్రి వేళ.. విశాఖలో మరోసారి గ్యాస్ లీక్?

Update: 2020-05-08 04:15 GMT
భయానికి మించిన శత్రువు మరొకటి ఉండదు. దానికి అనుమానం తోడైతే.. అగ్నికి వాయువు తోడైనట్లే. తాజాగా అలాంటి పరిస్థితే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఎల్ జీ పాలిమర్స్ సంస్థ నుంచి రసాయనం లీక్ కావటం.. వందలాది మంది ప్రభావితం కావటం తెలిసిందే. దీంతో.. తీవ్ర భయాందోళనలో ఉన్న అక్కడి ప్రజలకు.. గురువారం అర్థరాత్రి వేళ.. ప్రమాదకర రసాయన వాయువు మరోసారి లీక్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగింది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అర్థరాత్రి వేళ ఎన్ ఏడీ.. బాజీ జంక్షన్.. గోపాలపట్నం.. సుజాతనగర్.. పెందుర్తి.. అడివివరం.. పినగాడి.. సింహాచలం.. ప్రహ్లాదపురం.. వేపగుంట తదితర ప్రాంతాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చేశారు. జరుగుతున్న ప్రచారానికి తోడుగా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. దీంతో.. ఇళ్లల్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. వాహనాలు లేని వారు కాలి నడకన రోడ్ల మీదకు వచ్చేస్తే.. వాహనాలు ఉన్న వారు.. వాటిని తీసుకొని రోడ్ల బాట పట్టారు.

ప్రజల ఆందోళనలకు తగ్గట్లే అధికారులు సైతం.. అధికారులు ప్రజల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించటంతో లీక్ సందేహాలకు మరోసారి ఊతమిచ్చినట్లైంది. ఈ పరిణామాలతో మరోసారి గ్యాస్ లీక్ అవుతుందా? అన్న సందేహంతో పలువురు పోలీస్ స్టేషన్లకు.. మీడియా సంస్థలకు ఫోన్లు చేసి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ప్రజల్లో ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? అర్థరాత్రి వేళ ఈ గందరగోళం ఏమిటి? అన్న సందేహంతో విశాఖపట్నం సీపీ ఆర్కే మీనాకు పలువురు రిపోర్టర్లు ఫోన్లు చేశారు.

పుణేకు చెందిన ఎన్విరాన్ మెంట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తొమ్మిది మంది ప్లాంట్ లోపలకు వెళ్లి రసాయన వాయువుపై పరీక్షలు జరుపుతున్నారు. అర్థరాత్రి వేళలోనూ ఈ పరీక్షలు సాగాయి. దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవటంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ఇక.. విశాఖ సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ.. ఇప్పటికి ఈ ప్రాంతం సురక్షితం. రేపు (శుక్రవారం) శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అంతే తప్పించి రసాయనం మరోసారి లీక్ అయ్యిందా? లేదా? అన్న విషయానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలంతా ఒక్కసారి రోడ్ల మీదకు రావటంతో.. రోడ్లు మొత్తం జనాలతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News