ఏపీలో స్వీట్లు పంచారంట

Update: 2015-07-02 05:51 GMT
కొన్ని కొన్ని విమర్శలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. భావోద్వేగాల్ని టచ్‌ చేసే ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ రాజకీయ నేత వదిలిపెట్టరు. తాజాగా తమపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయటానికి టీఆర్‌ఎస్‌ నేతలు తమ మాటలకు కత్తులు నూరే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు స్పందించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్‌ అయిన రేవంత్‌కు బెయిల్‌ దొరికితే స్వీట్లు పంచుతారా? అంటూ ఏద్దేవా చేశారు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా జైలు నుంచి బెయిల్‌ మీద వస్తే ర్యాలీలు జరుపుతారా? అని మండిపడ్డారు.

రేవంత్‌కు.. ఏపీకి లింకులు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేవంత్‌కు బెయిల్‌ దొరికి.. జైలునుంచి బయటకు వస్తుంటే.. ఏపీలో స్వీట్లు పంచారని.. దీన్ని బట్టే.. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరికి ఊడిగం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. రేవంత్‌పై ఎదురుదాడి చేసేందుకు ఆంధ్రా ఆస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు బయటకు తీసేటట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News