జీహెచ్ ఎంసి ఓటర్లకు గాలం ?.. దుబ్బాక ఎఫెక్టేనా?

Update: 2020-11-15 08:30 GMT
అధికార టీఆర్ ఎస్ పార్టీపై దుబ్బాక ఉపఎన్నికల ఎఫెక్డ్ బాగానే పడినట్లు కనబడుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓడిపోయిన విషయం జనాలందరికీ తెలిసిందే.  ఉపఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి టీఆర్ఎస్ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే నామినేషన్ వేయటమే ఆలస్యం గెలిచేది తమ అభ్యర్ధే అన్నంత ధీమాగా ఉంది. అయితే యావత్ కమలనాదులు నియోజకవర్గంలోనే మోహరించటంతో పాటు రోజురోజుకు సీన్ మారిపోయింది. దాంతో హఠాత్తుగా టీఆర్ఎస్ నేతలు మేల్కొన్నప్పటికీ ఉపయోగం లేకపోయింది. దాంతో లక్ష ఓట్ల మెజారిటితో గెలుస్తామనుకున్న పార్టీ కాస్త చివరకు 1179 ఓట్లతో ఓడిపోయింది.

దీని ఎఫెక్ట్ టీఆర్ ఎస్ పై బాగా తీవ్రప్రభావం చూపినట్లు అర్ధమవుతోంది. ఎంతలా ప్రభావం చూపుతోందంటే డిసెంబర్ 4వ తేదీన జరుగనున్న జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ప్రకటించేంత. 15 వేల రూపాయల లోపు ఆస్తిపన్ను చెల్లించేవారికి 50 శాతం రాయితీ వర్తిస్తుందని మున్సిపల్ మంత్రి, కేసీయార్ కొడుకు కేటీయార్ ప్రకటించారు. దీపావళి కానుక అని పైకి చెబుతున్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో జనాలను ఆకర్షించటమే అసలు ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. లేకపోతే ఉన్నట్టుంది ఆస్తిపన్నులో 50 శాతం రాయితీలు ప్రకటించాల్సిన అసవరం ప్రభుత్వానికి ఏముంది ?

తాము ప్రకటించిన ఆస్తిపన్ను రాయితీలో హైదరాబాద్ పరిధిలోని 13.72 లక్షల కుటుంబాలకు  లబ్ది జరుగుతుందని కూడా కేటీయార్ ప్రకటించారు. అంటే 13.72 లక్షలు x 3 ఓట్లు వేసుకుంటే కూడా చాలు సుమారు 42 లక్షల ఓట్లుగా లెక్కేసుకోవాలి. ఇదే సమయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలోని పారిశుధ్య కార్మికుల జీతాలను రూ. 14500 నుండి 17500కి పెంచినట్లు ప్రకటించారు. ఇది కూడా ఫక్తు ఎన్నికల తాయిలం అనటంలో సందేహం లేదు.

దీపావళికి పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచటం, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఆస్తులను పరిహారం ప్రకటించటం, ఆస్తిపన్నులో రాయితీలను ఇస్తోందంటే దుబ్బాక ఎఫెక్ట్ ఎంత బలంగా పడిందో అర్ధమైపోతోంది. డిసెంబర్ 4వ తేదీన జరిగినా ఎప్పుడు జరిగినా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్  పరువంతా పోయినట్లే లెక్క. ఇందుకనే ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఇన్ని అవస్తలు పడుతోంది.
Tags:    

Similar News