తొలితరం ఇంగ్లీష్ న్యూస్ ప్రజెంటర్.. గీతాంజలి అయ్యర్ కన్నుమూత!

Update: 2023-06-08 09:17 GMT
ప్రముఖ టీవీ న్యూస్ యాంక‌ర్, తొలిత‌రం ఇంగ్లీష్ న్యూస్ ప్రజెంటర్ గీతాంజ‌లి అయ్యర్ కన్నుమూశారు. ఇంగ్లిష్ న్యూస్ ప్రజెంటర్ గా పాపులర్ అయిన గీతాంజలి అయ్యర్... తన జీవితంలో 30 సంవత్సరాల న్యూస్‌ రూమ్‌ కు అంకితం చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ లో ఉత్తమ టీవీ న్యూస్ ప్రెజెంటర్‌ గా పనిచేసి ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు.

1971లో దూరదర్శన్‌ లో చేరిన ఆమె నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌ గా అవార్డు పొందారు. ఆమె విశిష్టమైన సేవలకు గానూ 1989లో అత్యుత్తమ మహిళలకు ఇచ్చే “ఇందిరా గాంధీ ప్రియదర్శిని” అవార్డును గెలుచుకున్నారు. గీతాంజలి అయ్యర్ ఇంగ్లీష్‌ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కోల్‌ కతాలోని లోరెటో కాలేజీ నుండి పట్టభద్రురాలయ్యారు.

భారతదేశంలోని వరల్డ్ వైడ్ ఫండ్‌ లో మేజర్ డోనర్స్ హెడ్‌ గా పనిచేసిన ఆమె... ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి డిప్లొమా కూడా చేశారు. ఈ క్రమంలో... గీతాంజలి అయ్యర్ 1971లో దూరదర్శన్‌ లో చేరారు.

1978లో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నుండి విడిపోయినప్పుడు ఆమె దూరదర్శన్‌ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో... 1985 దూరదర్శన్ టీవీ సీరియల్ "ఖందాన్"లో కూడా నటించారు.

ఇదే క్రమంలో... 2001లో యష్ బిర్లా గ్రూప్‌ లో పబ్లిక్ అఫైర్స్ డిపార్ట్‌ మెంట్ వైస్ ప్రెసిడెంట్‌ గా కూడా పనిచేసిన అయ్యర్... కార్పోరేట్ ప్రపంచంలో కూడా తన పనితనాన్ని చూపించారు. అనంతరం.. 2005లో అంతర్జాతీయ సేల్స్ డైరెక్టర్‌ గా ఒబెరాయ్ గ్రూప్‌ కి మారిన ఆమె... తర్వాతి కాలంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కి సలహాదారుగా కూడా పనిచేశారు.

అక్కడితో ఆమె ప్రయాణం ఆగలేదు... అనంతర కాలంలో... ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రెస్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విభాగానికి డిప్యూటి హెడ్‌ గా కూడా ఆమె మూడేళ్లపాటు పనిచేశారు.

అయితే తాజాగా ఆమె మరణవార్త భారతీయులను కలిచి వేసింది. గీతాంజలి అయ్యర్ మృతిపై దూరదర్శన్ సిబ్బందితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నలిస్టులు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు సంతాపం తెలిపారు. 

Similar News