రాహుల్ లోఫ‌ర్ అయితే.. మోడీ మాటేంది?

Update: 2018-07-24 07:16 GMT
మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. మ‌ర్యాద‌.. మ‌న్న‌న అస్స‌ల్లేదు. నిజ‌మే.. దేశ ప్ర‌ధాని లాంటి అత్యుత్త‌మ స్థానంలో కూర్చున్న వారు సైతం రాజ‌కీయాల కోసం ఎలాంటి విన్యాసాల‌కైనా వెనుకాడ‌ని వేళ‌.. ఎవ‌రికి మాత్రం బాద్య‌త ఉంటుంది. ప‌దేళ్ల పాటు మౌన ప్ర‌ధానిని చూసిన దేశ జ‌నుల‌కు.. త‌మను పాలిస్తున్న అధినేత కాస్త మాట్లాడితే బాగుండ‌న్న ఆశ అత్యాశేమీ కాదు.

మోడీ ఎంట్రీతో ఆ లోటు తీరిపోయింది. కానీ.. ఇప్పుడు దేశ ప్ర‌జ‌లు త‌మను పాలిస్తున్న అధినేత మాటలు కాస్త త‌గ్గించి ప‌ని మీద శ్ర‌ద్ధ పెడితే బాగుండ‌ని భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా పార్ల‌మెంటులో చోటు చేసుకున్న విన్యాసాల‌కు కొర‌త లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తానికేమాత్రం ప‌ప్పును కాద‌ని త‌న చ‌ర్య‌తో చెప్పేశారు. ఊహించ‌ని రీతిలో కౌగిలించుకొని బీజేపీ వ‌ర్గాల‌కు అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాన‌ట్లు వ్య‌వ‌హరించారు.

త‌న విన్యాసాల‌తో మంత్రముగ్థుల్ని చేసే ప్ర‌ధాని మోడీ సైతం.. రాహుల్ చ‌ర్య‌కు త‌క్ష‌ణ‌మే స్పందించ‌లేక‌పోయారు. షాకులిచ్చే మోడీకే షాకిచ్చాడు.. అది కూడా ప‌ప్పు అంటే ఇంకేమైనా ఉంటుందా?  రాత్రికి రాత్రి రాహుల్ మీద అంచ‌నాలు అంత‌కంత‌కూ పెరిగిపోతాయి. మ‌రి.. అలా జ‌రిగితే ఇంకేమైనా ఉందా?  ఇప్ప‌టికే మోడీ గ్రాఫ్ ఎగుడుదిగుడుగా ఉన్న వేళ‌లో ఇలాంటివి మ‌రింత ఇబ్బందిని క‌లిగించ‌టం ఖాయం.

అందుకే.. అప్ప‌టిక‌ప్పుడు ఎదురుదాడి మొద‌లైంది. అవిశ్వాస తీర్మానం మీద స‌మాధానం ఇచ్చే క్ర‌మంలో మోడీ మాట‌ల్లో నాట‌కీయ‌త శ్రుతిమించింది. ప్ర‌ధాని స్థానంలో ఉన్న నేత నుంచి ఏ మాత్రం ఆశించ‌ని రీతిలో ఆయ‌న త‌న చేతుల్ని క‌దుపుతూ రాహుల్ ను ఎట‌కారం చేసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు అక్క‌డి పెద్ద‌లంతా అవాక్కు  అయ్యారు. రాహుల్ కు కౌంట‌ర్ ఇచ్చేందుకు మ‌రీ అంత‌లా త‌న స్థాయిని మోడీ త‌గ్గించుకోవాలా? అన్న మాట కొంద‌రి నోట వినిపించింది.

అయితే.. ఇంద్ర‌జాలికుడైన మోడీ త‌న చేష్ట‌ల‌తో అంద‌రిని ట్రాన్స్ లో ప‌డేసి.. రాహుల్ తీరును ఎట‌కారం చేసుకొని.. అది మాత్ర‌మే మ‌న‌సులో ముద్ర ప‌డేలా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయ‌న విధేయులు మాట‌ల యుద్ధానికి దిగుతున్నారు. మోడీని కౌగిలించుకోవ‌టం.. అనంత‌రం త‌న సీట్లో కూర్చొని క‌న్ను గీట‌టంపై గోవా బీజేపీ అధికార ప్ర‌తినిధి ద‌త్త‌ప్ర‌సాద్ మాట‌లు వింటే విస్మ‌యం చెందాల్సిందే.

ఎందుకంటే.. రాహుల్ కు క‌నీస మ‌ర్యాద ఇచ్చేందుకు సైతం  బీజేపీ నేత‌లు సిద్ధంగా లేర‌న్న సంగ‌తి ఆయ‌న త‌న మాట‌ల‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. ప్ర‌జాస్వామ్యాన్నికాపాడేందుకు కొలువు తీరిన ప‌విత్ర‌మైన పార్ల‌మెంటు ఆల‌యంలో రాహుల్ చేసిన ప‌నులు చాలా అవ‌మాన‌క‌రంగా ఉన్నాయ‌న్నారు. కాలేజీల్లో రోడ్ల‌పైన అమ్మాయిల్ని ఏడిపించే లోఫ‌ర్లు ఇదే త‌ర‌హాలో క‌న్నుగీటుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌టం చూస్తే షాక్ తినాల్సిందే. స‌భ‌లో రాహుల్ ఒక లోఫ‌ర్ మాదిరి వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

క‌న్నుగీట‌ట‌మే లోఫ‌ర్ ప‌ని అయితే.. ప్ర‌ధాని స్థానంలో కూర్చొని రాహుల్ కౌగిలింత‌ను ఎట‌కారం చేసుకునేందుకు మోడీ చేతులు తిప్పిన తీరును ఇంకేం అనాలి? అన్న‌ది కాంగ్రెస్ వాదుల ప్ర‌శ్న‌గా మారింది. చూస్తుంటే.. విలువ‌ల్ని వ‌దిలేసి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిట్టేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌ల తీరు చూస్తే.. రానున్న సార్వ‌త్రికానికి ఈ మాట‌ల తీవ్ర‌త ఏ స్థాయికి వెళుతుంద‌న్న‌ది ఊహ‌కు అంద‌నట్లుగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.


Tags:    

Similar News