గోదారి బోటు స‌త్యం చేతికి చిక్కేసింది..!

Update: 2019-10-18 12:18 GMT
పాపికొండ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా  గోదావ‌రి న‌దిలో మునిగిపోయిన బోటు వ‌శిష్ట ధ‌ర్మాడి స‌త్యం చేతికి చిక్కిన‌ట్లేనా...?  బోటు ప్ర‌మాదం జ‌రిగి నెల రోజులు అయిపోయినా కూడా ఏపీ స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని బోటు వెలికితీత ప‌నుల‌ను మాత్రం ఆపేయ‌లేదు. ప‌రిస్థితులు అనుకూలించ‌క‌, ప్ర‌కృతి స‌హాక‌రించ‌క పోవ‌డం, గోదావ‌రిలో వ‌ర‌ద ఉదృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆప‌రేష‌న్ వ‌శిష్ట మొద‌టి విడత అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక గోదావరిలో మునిగిపోయిన బోటు ఇక గంగార్ప‌ణ‌మే అనుకుంటున్న త‌రుణంలో స‌ర్కారు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాలు వాయిదా వేసుకుని అద‌ను కోసం, ప్ర‌కృతి స‌హాకారం కోసం వేచి చూసింది. ఇంత‌కాలం ఓపిక ప‌ట్టిన స‌ర్కారు కు అవ‌కాశం అందివ‌చ్చింది.. ధ‌ర్మాడి స‌త్యం త‌న ఆప‌రేష‌న్ రెండో విడ‌త‌ను ప్రారంభించారు.

అయితే ఇప్పుడు ఆప‌రేష‌న్ వ‌శిష్ట రెండోద‌శ విజ‌య‌వంతం అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వ‌శిష్ట బోటు ఈసారి ధ‌ర్మాడి స‌త్యం చేతికి చిక్కిన‌ట్లే అని అంతా భావిస్తున్నారు. దీంతో అటు ప్ర‌భుత్వంలో ఆశ‌, ఇటు బాధిత కుటుంబాల్లో కొంత ఊర‌ట క‌నిపిస్తుంది. అయితే ఆ బోటు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న త‌రుణంలో ఓ గొప్ప వార్త ఇప్పుడు అంద‌రిని ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. బోటు లంగ‌ర్ల‌కు చిక్కి దాదాపుగా 50 అడుగుల దూరంలో ఆగిపోయింద‌నే స‌మాచారం. గురువారం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్లే ఫ‌లించి త‌రువాత విఫ‌లం అయ్యాయి. దీనితో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ధ‌ర్మాడి స‌త్యం బృందం ఈరోజు బాగానే శ్ర‌మించి బోటును 50 అడుగుల మేర‌కు తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు చేయాల్సింది బోటు వ‌ద్ద‌కు గ‌జ ఈత‌గాళ్ళ‌ను న‌దిలోకి పంపి బోట‌కు ప‌క్కాగా లంగ‌ర్ల‌ను త‌గిలించి, తాళ్ళ‌తో బంధిస్తే ఇక బోటు ఒడ్డుకు రావ‌డ‌మే త‌రువాయి.. అయితే ఇలా న‌దిలోకి గ‌జ ఈత‌గాళ్ళు దూకాలంటే స‌ర్కారు అనుమ‌తి కావాల్సి వ‌స్తుంద‌ట‌.. అందుకు గ‌జ ఈత‌గాళ్ళ‌ను విశాఖ‌ప‌ట్నం నుంచి ర‌ప్పించి వారికి స‌రైన వ‌స‌తులు క‌ల్పిస్తే ఆఫ‌రేష‌న్ వ‌శిష్ట స‌క్సెస్ అవుతుంద‌ట‌.. ఇప్పుడు ప్ర‌భుత్వం అనుమ‌తి కోసం ధ‌ర్మాడి స‌త్యం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి బాగా తగ్గింది. సహాయ చర్యలకు కాస్త అనుకూలంగానే వాతావరణం ఉంది. దీన్ని ఉపయోగించుకుని పడవను పైకి లాగనున్నారు.

భారీ లంగరుతో పాటు 3 వేల అడుగుల ఇనుప తాడును, ఒక వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందుకోసం నేడు ఉపయోగించనున్నారు. ఏదైమైనా గతంలో పోలిస్తే బోటు మునిగిన ప్రాంతాన్ని, అది ఉన్న లోతును కాస్త ఖ‌చ్చితంగా అంచనా వేసినందున.. వీలైనంత త్వరగా దాన్ని ఒడ్డుకు లాక్కొస్తామంటున్నారు. బోటు వెలికితీతపై ధర్మాడి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని వెలికితీస్తేనే తనకు కాస్త ఊరటగా ఉంటుందన్నారు. ఏదేమైనా అటు ప్ర‌కృతి సానుకూలంగా ఉండ‌టం, ఇటు వ‌ర‌ద ఉదృతి కాస్త త‌క్కువ‌గా ఉండ‌టం, ధ‌ర్మాడి స‌త్యం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం, ప్ర‌భుత్వం కూడా ఎలాగైనా బోటును వెలికి తీయాల‌నే సంక‌ల్పం అన్ని సానూకూల వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంతో ఆప‌రేష‌న్ వ‌శిష్ట ఈ రోజు, లేదా రేపు బోటు బ‌య‌ట‌కి రావ‌డం త‌థ్య‌మే.
Tags:    

Similar News