తిరుపతిలో వజ్ర కిరీటాలు మాయం..

Update: 2019-02-03 09:47 GMT
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ఉత్సవ విగ్రహాలు తీసే సమయంలో 1.3 కిలోల బరువు గల మూడు పురాతన, విలువైన బంగారు కిరీటాలు కనిపించకపోవడం కలకలం రేపింది. ఉత్సవాల సందర్భంగా శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి దేవతలను అలంకరించడానికి తీస్తుండగా ఈ వజ్రాలతో నిండిన కిరీటాలు కనిపించకపోవడం తో స్వామి వార్లకు ఏ కిరీటం పెట్టాలో తెలియక  పూజారులు కంగారు పడ్డారు.

తిరుమల తిరుపతి దేశస్థానంలోని 18 ఉప ఆలయాలకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలు, కిరీటాలు, విలువైన వస్తువులు ఇందులో భద్రపరుస్తారు. శనివారం 5 గంటలకు నిత్యం రద్దీగా ఉండే ఆలయంలో ఈ కిరీటాలు మాయమైన విషయం సుప్రభాత సేవ సమయంలోనే తెలిసిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై శనివారం రాత్రి పోలీసులు, టీటీడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో పనిచేసేవారికి తెలియకుండా ఆ కిరీటాలు మాయమయ్యే చాన్స్ లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరు.? ఎలా మాయం చేశారనే దానిపై సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.  ఆలయ సిబ్బంది, అర్చకులను పోలీసులు విచారిస్తున్నారు.

శ్రీవేంకటేశ్వరస్వామి అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని 12వ శతాబ్ధంలో శ్రీరామానుజాచార్యులు నిర్మించారు.  తిరుమల కొండకు వచ్చిన ప్రతీ భక్తుడు తిరుపతిలోని గోవిందరాజస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. శ్రీవారికి లాగానే గోవిందరాజస్వామికి కూడా రాజులు, వివిధ ప్రాంతాల భక్తులు బంగారం, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, కిరీటాలను కానులుగా సమర్పిస్తారు. నాలుగేళ్ల క్రితం కూడా తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు తాజాగా కిరీటాలు మాయమవడం కలకలం రేపుతోంది.
    

Tags:    

Similar News