అక్ర‌మ మైనింగ్ లో చంద్ర‌బాబుకు వాటా!

Update: 2018-08-13 08:23 GMT
గురజాల నియోజకవర్గంలో కోనంకి -  కేసానుప‌ల్లి - సీతారాంపురంతో పాటు 8 చోట్ల అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ అక్రమ మైనింగ్‌ కేసులో గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు పాత్ర ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.దీంతో,య‌ర‌ప‌తినేనికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో, అ అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ప్రాంతాల‌ల‌లో నేడు ప‌ర్య‌టించాల‌న‌కున్న వైసీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ స‌భ్యుల‌ను ...పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్టు చేస్తున్నారు. గుర‌జాల వ‌చ్చేందుకు య‌త్నిస్తోన్న వారిని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించి నిర్బంధించారు. చాలా మంది నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడిపై నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ అక్ర‌మ మైనింగ్ స్కామ్ లో చంద్రబాబుకు - లోకేశ్ కు వాటా ఉంద‌ని, అందుకే య‌ర‌ప‌తినేనిని బ‌య‌ట‌ప‌డేసేందుకు  వైసీపీ నేత‌ల గొంతు నొక్కుతున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేత‌ల పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని  ప్రశ్నించారు. చట్టబద్ధంగా అనుమతివ్వ‌లేద‌ని, కానీ, అక్ర‌మ అరెస్ట్‌ లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మ‌రోవైపు, ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన ఆసుపత్రిని కూడా పోలీసులు నిర్భందించారు. పోలీసుల ఆంక్షలతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మ‌రోవైపు, ఆ ఆరెస్టుల‌పై గురజాల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కాసు మహేశ్‌ రెడ్డి మండిప‌డ్డారు. ఆ కేసు నుంచి య‌ర‌ప‌తినేనిని బ‌య‌ట‌ప‌డేసి - కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం వైసీపీ నేత‌ల‌ను అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. ఈ కేసు నుంచి య‌ర‌ప‌తినేని త‌ప్పించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. దాచేప‌ల్లిలో స‌భ‌కు అనుమ‌తిలేకుంటే....గుర‌జాల‌లో లేదా పిడుగురాళ్ల‌లో అనుమతి కోరామ‌ని....అయినా నిరాక‌రించార‌ని ఆరోపించారు. య‌ర‌ప‌తినేని బినామీలు - అనుచ‌రులు...అమాయ‌కులయిన‌ 17మంది పేర్ల‌ను అధికారులు మైనింగ్ కేసులో చేర్చార‌ని....అస‌లైన నిందితుల పేర్లు బ‌య‌ట‌కు రాలేద‌ని ఆరోపించారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్‌ కేసు పెట్టారని....దీనిని బ‌ట్టి ఈ కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఒక కూలీ 40 కోట్లు దోచుకున్నార‌ని అధికారులు చెప్పార‌ని,...క‌నీసం ఎక‌రం పొలం...లేని ఆ కూలీ 40 కోట్లు అక్ర‌మ మైనింగ్ చేశారంటే ఎవ‌రూ నమ్మలేరని అన్నారు. ఇలా...ఆ కేసులో ఇరికించిన పేర్ల‌న్నీ బినామీలు...అమాయ‌కులు....కూలీల‌వ‌ని....అసులు దోషులు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు వైసీపీ పోరాటం ఆప‌ద‌ని అన్నారు. పోలీసుల అరెస్టుల‌కు - బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌బోమ‌ని....ఎట్టి ప‌రిస్థితుల్లో వెనుక‌డుగు వేయ‌బోమ‌ని - సాయంత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకార‌మే అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ప్రాంతాల‌లో నిజ నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌టిస్తోంద‌ని అన్నారు.
Tags:    

Similar News