వెయ్యి నోటు లెక్కకు నో ఆన్సర్

Update: 2017-01-23 06:12 GMT
పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. రూ.వెయ్యి.. రూ.500నోట్లను రద్దు నిర్ణయాన్ని తీసుకున్నప్రధాని.. రూ.2వేల నోటును చెలామణిలోకి తీసుకురావటం తెలిసిందే. దీంతో.. భారీగా చిల్లర నోట్లకు కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు రూ.500నోట్లను విడుదల చేయాలంటూ భారీగా డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఇదే సమయంలో కొత్త రూ.500నోట్లు విడుదలయ్యాయి. కానీ.. రద్దు చేసిన వెయ్యి రూపాయిల లెక్క మాత్రం బయటకు రాని పరిస్థితి. రూ.500నోట్లకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నా.. వెయ్యి రూపాయిల నోటుకు సంబంధించి సమాచారాన్ని మాత్రం కేంద్రం గుట్టుగా ఉంచటం గమనార్హం.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చిన రూ.500 నోటును ప్రింట్ చేసేందుకు ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని తాజాగా కేంద్రం వెల్లడించింది.కొత్తగా ముద్రిస్తున్న ఒక్కోరూ.500 నోటుకు రూ.3.09ఖర్చు అవుతుందని.. వెయ్యి నోట్లను ముద్రించటానికి రూ.3090 ఖర్చు అవుతుందని తేల్చారు. సమాచార హక్కు చట్టం ఆధారంగా చేసుకొని ఒక సమాచార హక్కు కార్యకర్త  అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాల్ని వెల్లడించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రూ.500 నోటుకు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తున్న కేంద్రం.. కొత్తగా బయటకు తీసుకువస్తారని చెబుతున్న రూ.వెయ్యి నోటకు సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కనీయకపోవటం గమనార్హం. వెయ్యి నోట్లప్రింట్ ఆర్డర్ గురించి సమాచారాన్ని కోరగా.. వాటికి సంబంధించిన వివరాల్ని బయటకు వెల్లడించేందుకు ఆర్ బీఐ నో చెప్పేసింది. కొత్త వెయ్యి నోటు మీద అంత గుట్టు ఎందుకంట?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News