ప్ర‌భుత్వ ర‌హ‌స్య డాటా లీక్‌...ఏపీలో క‌ల‌క‌లం

Update: 2018-04-25 06:19 GMT
త‌మ‌ది టెక్నాల‌జీ ప‌రిపాల‌న అని, అసలు దేశ‌మంత‌టికి టెక్ పాఠాలు నేర్పిందే త‌ను అని ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకునే తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నార్థకం చేసే ప‌రిణామం చోటుచేసుకుంది. బ్లాక్‌ చైన్ టెక్నాల‌జీ వంటి విప్ల‌వాత్మ‌క సాంకేతిక‌తతో ముందుకు సాగుతున్నామ‌ని ప్ర‌క‌టించుకునే ఐటీ మంత్రి - సీఎం త‌న‌యుడు నారా లోకేష్ శాఖ గ‌ట్టి స‌వాల్ ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఓ ప్రభుత్వ శాఖ వెబ్‌ సైట్‌ లో వ్యక్తుల కులం - మతం - వృత్తి తదితర వ్యక్తిగత వివరాలు బహిర్గతం కావడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. దాదాపు 1.3 లక్షల మంది ఆధార్‌ నెంబర్లతో పాటు ఈ వివరాలనూ వెబ్‌ సైట్‌ లో ఉంచినట్టు సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఒక‌రు ఆరోపించారు. ప్రభుత్వ వెబ్‌ సైట్‌ చూపిస్తున్న డేటా స్క్రీన్‌ షాట్స్‌ ను సైతం ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

ఆయ‌న వెల్ల‌డించిన వివ‌రాల‌లోని స్క్రీన్‌ షాట్స్‌లో వ్యక్తుల ఆధార్‌ నెంబరు - బ్యాంకు శాఖ - బ్యాంకు కోడ్‌ - ఖాతా నెంబరు - తండ్రి పేరు - చిరునామా - గ్రామ పంచాయతీ - మొబైల్‌ నెంబరు - రేషన్‌ కార్డు నెంబరు - వృత్తి - కులం - మతానికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. సాధారణంగా సున్నితమైన అంశాలను(వ్యక్తుల కులం - మతం - వృత్తి....) యూఐడీఏఐ అనుసంధానం చేయదని, కానీ, ఇతర ప్రభుత్వ శాఖలు ఇలా చేస్తున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వ శాఖ లీక్‌ చేసిన వ్యక్తిగత వివరాలు బహిరంగంగానే ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలు సేకరించేందుకు తానేమీ హ్యాకింగ్‌ లేదా అనధికారిక యాక్సెస్‌ ను ఉపయోగించలేదని చెప్పారు. అంతేకాక, వెబ్‌ సైట్‌ లో సెర్చింగ్‌ ఆప్షన్‌ కూడా ఉందని, దీని కారణంగా టార్గెట్‌ చేసుకున్న వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా తెలుసుకునేందుకు వీలుందని, వారిని ఇబ్బంది పెట్ట‌వ‌చ్చ‌ని స‌ద‌రు నిపుణుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో రోజుకో డేటా లీకేజీ వ్యవహారం వెలుగులోకి వ‌స్తున్న త‌రుణంలో ఏపీ స‌ర్కారు జాగ్ర‌త్త తీసుకోక‌పోవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.
Tags:    

Similar News