ఈసీ స్వతంత్రతపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య.. బీజేపీకి షాక్ లగా?

Update: 2022-11-23 11:36 GMT
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా దేశంలో పనులు జరుగుతుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ కూడా ఆ పార్టీ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.  సీబీఐ, ఐటీ, ఈడీలే కాదు.. ఎన్నికల కమిషన్ కూడా గుజరాత్ కు ఒకలా? బెంగాల్ కు మరోలా? తమిళనాడు, ఏపీకి ఇంకోలా ఎన్నికల నిర్వహణలు జరుపుతారు. బీజేపీకి అనుకూలంగానే షెడ్యూల్ విధిస్తారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ డౌట్లు సామాన్యులకే కాదు.. స్వయంగా సుప్రీంకోర్టుకు కూడా వచ్చాయి. తాజాగా ఎన్నికల సంఘం స్వతంత్రతపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి చెంప పెట్టులా మారాయి. ప్రభుత్వాలు ఎన్నికల సంఘం స్వేచ్ఛను పూర్తిగా హరించాయని సుప్రీంకోర్టు మండిపడింది.

తరచూ సీఈసీల బదిలీనే ఇందుకు నిదర్శనం. యూపీఏ హయాంలో 8 ఏళ్లలో ఆరుగురు సీఈసీలు మారారు. 2015-22 మధ్య బీజేపీ ప్రభుత్వంలో ఏడేళ్లలోనే 8 మంది మారారు. ఎలక్షన్ కమిషన్ చట్టం ప్రకారం సీఈసీ పదవీకాలం ఆరేళ్లు. కానీ 2004 తర్వాత ఎవరూ ఆ దరిదాపుల్లో కూడా లేరు అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలతో పలువురు బాలలు మాట్లాడితే ఇదే బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పిల్లలతో కాంగ్రెస్ ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. దానికి ఈసీ నోటీసులు ఇచ్చింది. కానీ స్వయంగా ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో బీజేపీకి ఫేవర్ గా ఒక బాలికను తనవద్దకు తీసుకొచ్చి మరీ బీజేపీ పాట పాడించాడు.దీనిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే ఈసీ వద్ద చర్యలేలేవు.

ఇదొక్క ఉదాహరణ మాత్రమే కాదు.. కేంద్రంలోని పెద్దలకు ఒకలా.. ప్రతిపక్షాలకు మరోలా ఈసీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అని పేరు మార్చి టీఆర్ఎస్ ఇన్నిరోజులు ఎదురుచూస్తున్నా ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. బీజేపీ చెప్పు చేతల్లోనే అనుమతి రాకుండా.. గుర్తులు కేటాయించకుండా ఇలా నాన్చివేస్తున్నారని ఆరోపణలున్నాయి.  ఇలా కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రపై ఇప్పటికీ నీలినీడలు ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News