గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లిన‌ట్లు?

Update: 2018-10-27 05:23 GMT
నిజం ఎంత‌న్నది తెలీదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న ఒక అంశం ఇప్పుడు విప‌రీత‌మైన ఆస‌క్తి వ్య‌క్తం కావ‌టం మాత్ర‌మే కాదు.. అవునా? అంటూ భారీ చ‌ర్చ న‌డుస్తోంది. మోడీ స‌ర్కారుకు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఎంత కీల‌క‌మ‌న్న విష‌యంపై తాజాగా మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన వైనం తెలిసిందే. ఆయ‌నక్క‌డ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు ఇస్తున్న అన‌ధికార స‌మాచారం ప్ర‌కారం.. రెండు తెలుగురాష్ట్రాల్లో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లేందుకు అని చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్న‌ది లేద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యోదంతానికి ముందే గ‌వ‌ర్న‌ర్ సాబ్ వారి ఢిల్లీ టూర్ క‌న్ఫ‌ర్మ్ అయినందున‌.. ఆ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేదు (నాయ‌కుల చ‌ర్చ‌ల్లో సాగిన అంశాల ఆధారంగానే సుమా)  ఇంత‌కీ గ‌వ‌ర్న‌ర్ సాబ్ అంత అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్లి.. ప్ర‌ధాని మోడీతో ఎందుకు భేటీ అయిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు కొంద‌రు చెబుతున్న స‌మాధానం వింటే ఆస‌క్తి రెట్టింపు కావ‌ట‌మే కాదు..వామ్మో మ‌న న‌ర‌సింహ‌న్ సాబ్ క‌నిపించేంత మామూలోడు కాద‌న్న మాట అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

న‌ర‌సింహ‌న్ పూర్వ‌రంగంలో సీబీఐ మాజీ బాస్ అన్న‌ది తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో సీబీఐలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాత్రికి రాత్రి సీబీఐ డైరెక్ట‌ర్ ను మార్చేసి.. మ‌రొక‌రిని తాత్కాలికంగా నియ‌మించ‌టం.. ఆ పెద్ద మ‌నిషి అర్థ‌రాత్రి 1.45 గంట‌ల స‌మ‌యంలో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ట‌మే కాదు.. త‌న‌కు ముందున్న డైరెక్ట‌ర్‌.. స్పెష‌ల్ డైరెక్ట‌ర్ల ఛాంబ‌ర్ల‌ను అంత అర్థ‌రాత్రి వేళ సోదాలు నిర్వ‌హించి.. సీజ్ చేయ‌టం లాంటి సినిమాటిక్ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

దేశం మొత్తం గాఢ నిద్ర‌లో ఉన్న వేళ‌.. జ‌రిగిపోయిన ఈ ఉదంతంలో ఎంత తీవ్ర‌త ఉందో.. అంత తీవ్ర‌తను చాలా మీడియా సంస్థ‌లు క్యారీ చేయ‌క‌పోవ‌టం ఒక అంశం. దాన్ని ప‌క్క‌న పెడితే.. దీనికి గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు సంబంధం ఏమిట‌న్న పాయింట్ లోకి వ‌స్తే.. రోమాలు నిక్క‌బొడితే స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తోంది.

సీబీఐకి ఎక్స్ బాస్ గా అనుభ‌వం ఉన్న న‌ర‌సింహ‌న్ ను.. తాజా ప‌రిస్థితుల్లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలన్న స‌ల‌హాలు.. సూచ‌న‌ల కోస‌మే మోడీ ఢిల్లీకి పిలిపించిన‌ట్లుగా చెబుతున్నారు. రాత్రికి రాత్రే సీబీఐని ప్ర‌క్షాళ‌న చేసిన వైనంపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌టం.. సీబీఐని ఇలా చేస్తారా? అంటూ మోడీపై దుమ్మెత్తి పోస్తున్న వేళ‌.. రాఫెల్ ఇష్యూలో అలోక్ వ‌ర్మ తీసుకున్న నిర్ణ‌యాలు త‌మ‌కు ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చేలా చేస్తాయ‌న్న అంశంపై చ‌ర్చ కోస‌మే గ‌వ‌ర్న‌ర్ సాబ్ ను ఢిల్లీకి అర్జెంట్ గా ర‌మ్మ‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. విన్నంత‌నే నిజ‌మ‌నిపించేలా ఉన్న ఈ ఇష్యూలో నిజానిజాలు ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.
Tags:    

Similar News