రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేరు చెప్పినంతనే.. ఆయన దైవభక్తి.. పుణ్యక్షేత్రాల్లో తరచూ కనిపించే ఆయన చప్పున గుర్తుకు వస్తారు. అంగవస్త్రాన్ని కట్టుకొని.. గుళ్లల్లో చేసే ప్రదక్షిణలు.. ఆయన పుణ్య క్షేత్రాల యాత్రలు పెద్ద ఎత్తున చర్చకే తెర తీశాయి. ఇక.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు లాంటి వారైతే.. గవర్నర్ మీద ఓపెన్ గానే ఫైర్ అయ్యే పరిస్థితి.
ఆ మధ్యన ఒక ప్రముఖ మీడియా సంస్థ కొత్త సంవత్సరం రోజున.. నరసింహింన్ దైవ భక్తి..ఆ కారణంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల మీద మొదటి పేజీలో ప్రముఖంగా ఒక వార్త అచ్చు వేయటంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్లు చెబుతారు. ఇలా గవర్నర్ నరసింహన్ దైవదర్శనాల వ్యవహారంపై జరిగిన చర్చ అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ హేతువాద సంఘం ఆధ్యక్షులు వెంకటసుబ్బయ్య.. సమాచార హక్కు చట్టం కింద.. గవర్నర్ గారి దైవదర్శనాల కోసం ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేశారో చెప్పాలంటూ ఒక దరఖాస్తు చేశారు.