నోరు తెరిచి అడ్డంగా బుక్ అయిన గ‌వ‌ర్న‌ర్?

Update: 2018-01-06 17:30 GMT
ఎన్ని ఛాన‌ళ్లు ఉన్నా.. పేప‌ర్లు చూపించే ప్ర‌భావం ఎంత‌న్న‌ది ఈ రోజు పొద్దున్నే పేప‌ర్లు చూసినోళ్లంద‌రికి అర్థ‌మై ఉంటుంది. నిన్నంతా న్యూస్ ఛాన‌ళ్ల‌ను చూసిన వారికి.. ఈ రోజు పేప‌ర్లు చూసినోళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయిన ప‌రిస్థితి. రాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన కాంగ్రెస్ నేత‌ల‌కు.. గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య అంత ర‌చ్చ జ‌రిగిందా? అని అవాక్కు అయిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వార్త‌లు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయో తెలిసిందే.

గ‌తంలో మాదిరి దూకుడుగా వార్త‌లు ఇవ్వ‌టం త‌గ్గించేసి కొన్నేళ్లు అవుతుంది. నియంత్ర‌ణ‌తో ఇస్తున్న వార్త‌ల్లోనే ఇంత హ‌డావుడి క‌నిపించిందంటే.. వాస్త‌వంగా మ‌రెంత హ‌డావుడి జ‌రిగిందా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది.  గ‌వ‌ర్న‌ర్.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఒక గ‌వ‌ర్న‌ర్ ను ఉద్దేశించి.. ఆయ‌న ముఖం మీద‌నే.. మా సోనియ‌మ్మ‌.. మ‌న్మోహ‌న్ పెట్టిన భిక్ష ఈ గ‌వ‌ర్న‌ర్ గిరి అంటూ క‌డిగేయ‌టం.. దానికి న‌ర‌సింహ‌న్ మౌనంగా ఉండాల్సి రావ‌టం చూసిన‌ప్పుడు ఎలాంటోడికి ఎలాంటి ప‌రిస్థితి అనిపించ‌క‌మాన‌దు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన న‌ర‌సింహ‌న‌న్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. క‌ఠినమైన ప‌రిస్థితుల్ని ఫేస్ చేశారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఉండే టెన్ష‌న్ వాతావ‌ర‌ణంతో పాటు.. ప‌లు సంద‌ర్భాల్లో టీఆర్ఎస్ ఉద్య‌మ నేత‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగిస్తున్న వేళ‌..నాటి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఆయ‌న్ను మాట్లాడ‌కుండా ఉండే ప్ర‌య‌త్నం చేయ‌టం మొద‌లు చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సంద‌ర్భంలో.. ప్ర‌త్యేక కేసుగా భావించి న‌ర‌సింహ‌న్‌ కు స్థాన‌చ‌ల‌నం జ‌ర‌గ‌లేదు. త‌ర్వాతి కాలంలో న‌ర‌సింహ‌న్ ను ఇంటికి పంపుతార‌న్న మాట వినిపించినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఆయ‌న‌కున్న సాన్నిహిత్యంతో ఆ ఇబ్బందిని అధిగ‌మించ‌గ‌లిగారు.

ఎన్నో కీల‌క సంద‌ర్భాల్లో ఆచితూచి మాట్లాడిన న‌ర‌సింహ‌న్ తాజా ఉదంతంలో మాత్రం బ్యాలెన్స్ మిస్ కావ‌టం విశేషంగా చెప్పాలి. కూల్ గా ఉన్న‌ట్లుగా ఉండ‌టం.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న తొంద‌ర‌ప‌డ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. ఈ కార‌ణంతోనే విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నా.. ఎవ‌రూ ఆయ‌న్ను వేలెత్తి చూపించ‌ని ప‌రిస్థితి. కానీ.. తాజాగా మాత్రం అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేదు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాజాగా కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసి గ‌వ‌ర్న‌ర్ తో వాగ్వాదానికి దిగ‌టం చూస్తే.. న‌ర‌సింహ‌న్ రిటైర్ కావాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిందా? అనిపించ‌క మాన‌దు. అధికార ప‌క్షానికి తాను ఎంతో కొంత పాజిటివ్ గా ఉంటాన‌న్న‌ది నిజ‌మే అయినా.. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోవ‌టానికి.. అలాంటి సంకేతాలు కనిపించేలా వ్య‌వ‌హ‌రించేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది.. న‌ర‌సింహ‌న్ లాంటి వ్య‌క్తి నోటి నుంచి సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్ ను ఎందుకు ఊరికే అంటారు? అనే వ‌ర‌కు వెళ్లటాన్ని ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌న‌సులోని ఇష్టాన్ని మాట‌ల్లో చూపించ‌టం మిగిలిన వారికి ఓకే అయినా.. గ‌వ‌ర్న‌ర్ లాంటి కీల‌క స్థానాల్లో ఉన్న వారు చేసే ప‌నేనా? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. మొద‌టిసారి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి వివ‌ర‌ణ లాంటి రియాక్ష‌న్ మీడియా వ‌ర్గాల‌కు అందింద‌ని చెప్పాలి. ఏది ఏమైనా.. తాజా ప‌రిణామాలు చూస్తే అనిపించేది ఒక్క‌టే.. ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు సైతం.. ఏదో ఒక‌రోజు కింద‌కు దిగాల్సిందేన‌ని. తెలివైనోళ్లు అంతా బాగున్న‌ప్పుడు కాలానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌మ‌కు తాము నిష్క్ర‌మిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం నిష్క్ర‌మించ‌బ‌డేలా కాలానికి అవ‌కాశం ఇస్తుంటారు.న‌రసింహ‌న్ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారా?
Tags:    

Similar News