మళ్లీ గవర్నర్ కు నో ఎంట్రీ.. తమిళిసై లేకుండానే అసెంబ్లీ?

Update: 2022-09-04 12:30 GMT
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ తో ప్రారంభింపచేస్తారు. ప్రభుత్వ ప్రణాళికలను, చేయబోయే పథకాలను గవర్నర్ చేత చదివించి అసెంబ్లీలో ప్రారంభోపన్యాసం చేయిస్తారు. కానీ ఈ సంప్రదాయానికి పోయినసారి నీళ్లొదిలిన కేసీఆర్ సర్కార్.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు నిర్వహించి షాక్ ఇచ్చింది. తాజాగా మరోసారి అలాంటి సాహసమే చేస్తూ షాకిస్తోంది.

ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ రెడీ అవుతోంది. గతంలో మాదిరిగానే రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడానికి బీజేపీతో కేసీఆర్ కు ఉన్న వైరమే కారణమని కొందరు అంటున్నారు.

తెలంగాణపై దండయాత్ర చేస్తున్న బీజేపీని తనకు శత్రువుగా కేసీఆర్ భావిస్తారు. మోడీషాలను.. వారి మాట ప్రకారం తన ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్న గవర్నర్ తమిళిసైని అస్సలు సహించడం లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులను ప్రోటోకాల్ కూడా పాటించనీయడం లేదు. తమిళిసైని బీజేపీ నాయకురాలుగా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

గత సంవత్సరకాలంగా కేసీఆర్ సర్కార్ ను డైరెక్టుగా గవర్నర్ తమిళిసై విమర్శిస్తుండడంతో ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా.. గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించే సంప్రదాయినికి కేసీఆర్ తెరతీశారు.మార్చి 15న ముగిసిన బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదని చెబుతున్నారు.  అందువల్ల ఇప్పుడు జరిగే సమావేశాలు దానికి కొనసాగింపేనని కేసీఆర్ సర్కార్ అంటోంది.

గతంలో బడ్జెట్ సమావేశాల సమయంలోనూ ఇదే కారణం చెప్పారు. అప్పుడు మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి గవర్నర్ తమిళిసై తెగ ఫీల్ అయ్యారు. ఇప్పుడు కొనసాగింపు సమావేశాలంటూ ఇప్పుడు కూడా గవర్నర్ ను పిలవకుండానే అసెంబ్లీకి రెడీ అయ్యారు. కేసీఆర్ పంతం పట్టడంతో గవర్నర్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఇలా సర్కార్ ఉన్న లూప్ హోల్స్ అన్నీ వెతికి మరీ అమలు చేస్తోంది.

ఇదివరకూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1970,2014లలో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితులు దాపురించడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
Tags:    

Similar News