గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం.. కేర‌ళ రాజ‌కీయంలో స‌రికొత్త ప‌ద‌నిస‌!

Update: 2022-10-27 04:15 GMT
కేర‌ళ‌లో ఉన్న క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వానికి.. కంటిపై కునులేకుండా పోయింది. ఏ నిముషం ఏం జ‌రుగుతుందో.. గ‌వ‌ర్న‌ర్ ఏక్ష‌ణంలో ఎలాంటి ఆదేశం ఇస్తారో.. తెలియ‌క‌.. ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ గ‌డ‌బిడ‌కు గుర‌వుతున్నారు. దీంతో అస‌లు కేర‌ళ‌లో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వానికి తిరుగులేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆరోప‌ణ‌లు కూడా లేవు. అయితే.. తాజాగా గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌తో ఎక్క‌డో చెడిపోయింది. దీంతో రోజుకో వివాదం తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్పుడు తాజాగా ఈ వివాదం మరో అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర‌ ఆర్థిక మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు కేఎన్ బాలగోపాల్ పై తాను విశ్వాసం కోల్పోయినట్లు గవర్నర్ ప్రకటించారు. ఫలితంగా.. మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కోర‌డం.. కేర‌ళ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. అంతేకాదు.. సీఎం పిన‌ర‌యి.. హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ.. అలా ఆదేశించ‌నూ లేదు. పైగా.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కే  స్పష్టం చేయ‌డం మ‌రింత వివాదంగా మారింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్పై తాను విశ్వాసం కోల్పోయినట్లు పినరయి విజయన్‌కు రాసిన లేఖలో గవర్నర్  పేర్కొన్నారు.

గ్యాప్ ఇదేనా..?అస‌లు విజ‌య‌న్ స‌ర్కారుకు గ‌వ‌ర్న‌ర్‌కు ఎక్క‌డ చెడింద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో తొలి అడుగు.. అక్టోబర్ 19న తిరువనంతపురంలోని ఓ యూనివర్సిటీలో ప‌డింద‌ని అంటున్నారు. ఇక్కడ జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి బాలగోపాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నేరుగా ఆయ‌న పేరు చెప్ప‌క‌పోయినా.. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన వారు కేరళ యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. అప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌.. 9 యూనివ‌ర్సిటీల్లో వీసీల‌ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై వివాదం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే మంత్రి ఇలా వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ నేరుగా రియాక్ట్ అయ్యారు.  మంత్రి వ్యాఖ్యలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని  సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తన విశ్వాసం కోల్పోయారని లేఖలో తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. అయితే.. సీఎం విజ‌య‌న్ గవర్నర్‌ లేఖపై రివ‌ర్స్‌గా రియాక్ట్ అయ్యారు. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్థిక మంత్రిపై తనకు 'అచంచలమైన విశ్వాసం' ఉందని బదులిచ్చారు.

అయితే.. ముఖ్యంగా ఇటీవల విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారమే గ‌వ‌ర్న‌ర్‌కు విజ‌య‌న్ స‌ర్కారుకుమ‌ధ్య గ్యాప్ పెంచింద‌నే భావ‌న ఉంది.తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్‌కు అస‌లు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. మరోవైపు.. గవర్నర్ ఆదేశాల్ని సవాలు చేస్తూ వీసీలు న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఈ ప‌రిణామాల‌తో రోజుకొక వివాదంగా మారింది.

కామ్రెడ్ పాల‌నపైనా.. విమ‌ర్శ‌లు ఇదిలావుంటే.. గ‌వ‌ర్న‌ర్.. సీఎం విజ‌య‌న్ పాల‌న‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ద్యం, లాట‌రీలు అమ్మి వ‌చ్చిన సొమ్ముతో పాల‌న చేస్తున్నార‌ని.. ఇలా చేస్తార‌ని.. తాను ఊహించ‌లేద‌ని.. అన్నారు. అంతేకాదు.. 99 శాతం మంది చ‌దువుకున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మి.. లాట‌రీలు ఆడిస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News