పేదల గుండెలపై ముద్రించిన కలర్ ఫొటో వైఎస్

Update: 2020-09-02 13:00 GMT
మహానేత భౌతికంగా దూరమై నేటికి పదకొండేళ్లు. డిజిటల్ ప్రపంచంలో ఇది.. సుదీర్ఘకాలం. ఒకరోజులోనే అంతా మరచిపోయే పరిస్థితి. తమ మధ్య లేని వారి గురించి పట్టించుకోవటం ఇప్పట్లో కనిపించదు. అలాంటిది పదకొండేళ్ల క్రితం కోట్లాది మంది నుంచి వెళ్లిపోయిన ఆయన గురించి ఇప్పటికి ఆలోచనలు వెంటాడుతుంటాయి. ప్రతి సందర్భంలోనూ ఆయన కానీ ఉంటేనా? అన్న మాట తరచు ఎందుకు వినిపిస్తోంది? రాజసం ఉట్టిపడటమే కాదు.. ఆయన ఉంటే కొండంత అండగా అనిపించే తత్త్వం అందరికి సాధ్యం కాదు.

నేతలు.. మహానేతలు చాలామందే ఉంటారు. కానీ.. జనాల గుండెల్లో ఉండిపోయే వారు చాలా అరుదుగా ఉంటారు. విధానపరంగా వ్యతిరేకించేటోళ్లు సైతం.. ఆయన్ను మిగిలిన విషయాల్లో అభిమానించటం.. ఆదరించటం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాత్రమే సాధ్యమయ్యేది. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటం.. మొండితనం ఉంటుంది కానీ మోతాదు దాటదు. మూర్తీభవించిన దయాగుణం.. అన్నింటికి మించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకునే విషయంలో కొలత వేసినట్లుగా వ్యవహరించే అలవాటు అందరికి ఉండదు. ఆ విషయంలో వైఎస్ ను మించినోళ్లు కనిపించరు.

విభజన తర్వాత.. ఎవరి సంగతి వారు అన్నట్లు మారాక కూడా.. తమ గుండెల్లో నిలిచిన నేతను కొలిచేందుకు బయటకు రావటం చూస్తే.. అలాంటి జనాదరణ వైఎస్ కు మాత్రమే సాధ్యమేమో అన్న భావన కలగటం ఖాయం. ఏపీలో వైఎస్ ను స్మరించుకోవటం పెద్ద విషయం కాదు. తెలంగాణలో వైఎస్ నివాళులు అర్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూస్తే.. వైఎస్ ముద్ర ప్రజల మీద ఎంతన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ప్రాంతాల పరిమితులకు అతీతంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకునే ప్రజానేత ఎవరైనా ఉన్నారంటే.. వైఎస్ ముందుంటారు. ఆరేళ్ల పదవీ కాలానికి ఎందుకింత ఆదరణ.. ఎందుకింత అభిమానం అన్నది ప్రశ్న. నేనున్నా.. అన్న మాటతో కొండంత బలమే కాదు.. ప్రజల మనసెరిగి నిర్ణయాలు తీసుకోవటంలో వైఎస్ కు సాటి వచ్చేవారెవరూ కనిపించరు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోని అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా వైఎస్ ను చెప్పాలి. ఆయనకు ముందుగా సంక్షేమ కార్యక్రమాలు లేవా? అంటే ఉన్నాయి. కానీ.. అవేవీ ప్రజల ఆర్తిని తీర్చేవి కావన్నది మర్చిపోకూడదు.

ప్రజలకు ప్రభుత్వం ఇస్తే గిస్తే.. పాతిక రూపాయిలు.. మహా అయితే వంద రూపాయిలు. కష్టంలో ఉన్నవాడిని ఆదుకునేలా పథకాల రూపకల్పన ఉండాలే కానీ.. అరకొర సాయంలా కాదు. రోడ్డు మీద ప్రమాదానికి గురైతే.. నిమిషాలలో అక్కడకు అంబులెన్సు చేరుకొని.. వైద్యం చేయటం.. డబ్బుల గురించి అడగకపోవటం లాంటి సౌకర్యం గురించి పదహారేళ్ల వెనుకే ఆలోచించటం అంత తేలికైన విషయమా?

చదువుకోవాలని ఉంటుంది.. కానీ చదువుకోలేని ఇంటి పరిస్థితులు. అలాంటప్పుడు ఫీజులు మాఫీ చేసేసి.. మీరు కోరుకున్నది చదవడంటూ ప్రోత్సహించటం దశాబ్దాన్నర కంటే ముందే ఉండటం దేనికి నిదర్శనం? ఇవన్నీ ఒక ఎత్తు.. ఆసుపత్రికి వెళ్లిన సామాన్యుడు.. తన జబ్బుకు ఎంత ఖర్చు అయినా మేం ఉన్నామంటూ ప్రభుత్వం అండగా ఉండే ఆరోగ్య శ్రీకి ఆద్యుడు.ఎన్నో లక్షల కుటుంబాలకు తన పథకాలతో లబ్థిదారులగా చేసిన రాజనన్నను ఎవరు మాత్రం మర్చిపోతారు.

ఇవాల్టి రోజున ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న లక్షలాది మంది పదిహేనేళ్ల క్రితం ఒక మోస్తరు ఆర్థిక పరిస్థితి ఉన్న వారే. వారు ఈ రోజున ఇలాంటి పరిస్థితికి ఉండటం వెనుక.. వైఎస్ అమలు చేసిన ఏదో పథకంలో లబ్థిదారులై ఉంటారన్నది మర్చిపోకూడదు. ఆ రోజున వారికి అండగా నిలిచి.. వారి ఆర్థిక పరిస్థితి దెబ్బ తినకుండా దన్నుగా నిలిచిన వైనమే.. ఆయన్ను జనాల మనసుల్లో నిలిచిపోయేలా చేసింది. ఇవాల్టి పాలకులు లక్షల కోట్ల బడ్జెట్ లోనూ ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. అలాంటిది అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో.. పరిమితమైన వనరులతోనే వైఎస్ ఎలా చేయగలిగారు? దటీజ్ వైఎస్ అనుకోకుండా ఉండలేం.

వైఎస్ లో మరో గుణం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ఆయన ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అది ఏ విషయంలో అయినా. తనను అభిమానించే కోట్లాది మందిని నిర్దయగా విడిచి పెట్టి వెళ్లటానికి 45 గంటల ముందు జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు తెచ్చుకుంటే.. వైఎస్ ఎంత ప్రాక్టికల్ గా ఉంటారన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సీఎం చాంబర్ లో ఉన్న ఆయన్ను కలవటానికి కొందరు మీడియా ప్రతినిధులు రావటం.. వారితో పిచ్చాపాటి (కొందరేమో దీన్ని మర్యాదపూర్వకంగా అంటారు) మాట్లాడేందుకు వైఎస్ సరేనన్నారు (వారం.. పది రోజులకు ఒకట్రెండు సార్లు అలా మాట్లాడేవారు. ఇప్పటి ముఖ్యమంత్రుల మాదిరి కాదు)

ఈ సందర్భంగా ఒక మీడియాప్రతినిధి సరదాగా సార్.. అరవై ఏళ్లు వచ్చాయి. గతంలో మీరు అరవై ఏళ్లు నిండాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.. మొన్న జులై 8 నాటికి మీకు అరవైఏళ్లు నిండాయి కదా? అని అడిగారు. దానికి వైఎస్ బదులిస్తూ.. ‘‘అవునయ్యా చాలాకాలం క్రితం చెప్పారు. ఇప్పుడు మనిషి సగటు జీవితకాలం పెరిగింది కదా. నేను కూడా ఎక్కువ కాలం పని చేయాలనుకుంటున్నాను. ఐనా మీ మీడియాలోనే నాకు మంచి దేహధారుఢ్యం ఉందనీ.. చురుకుగా పని చేస్తున్నానని రాస్తున్నారు కదా’’ అని బదులిచ్చారు.

దీనికి అక్కడున్న మరో విలేకరి స్పందిస్తూ.. అయితే.. మీరు శాశ్వతంగా ఈ పదవిలో ఉండాలనుకుంటున్నారా?’ అని అడిగేశారు. ‘వెళ్లవయ్యా.. ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా శాశ్వతంగా బ్రతకటానికి’ అంటూ నవ్వేశారు. ఇది జరిగిన 45 గంటల తర్వాత ఆయన ఘోర ప్రమాదంలో అందరిని వదిలేసి వెళ్లిపోయారు. ఇక్కడ చెప్పేదేమంటే.. ఒక విలేకరి.. ఒక ముఖ్యమంత్రి మధ్య మాటలు ఎంత స్వేచ్ఛగా ఉంటాయని చెప్పటం.. మరొకటి.. సరదాగాకు కూడా అహంభావాన్ని ప్రదర్శించకుండా ఉండటం. అందుకే.. ఆయన ఎప్పటికి కీర్తిశేషులుగా చెప్పటం.. ఆయన కీర్తి అశేషమని మాత్రమే చెప్పగలం.
Tags:    

Similar News