జీఎస్టీలో మిన‌హాయింపులు... ఏ రాష్ట్రాలకో?

Update: 2017-08-05 11:32 GMT
ఒకే దేశం, ఒకే ప‌న్ను విధానం... ఇదీ మ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ వినిపించిన నినాదం. ఈ త‌రహా ప‌న్ను విధానం కోస‌మే గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌(జీఎస్టీ)ని అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్నామంటూ కేంద్రంలోని మోదీ సర్కారు చెప్పిన మాట ఇంకా మ‌న చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఈ ప‌న్ను విధానం త‌మ‌కు ఆమోద‌యోగ్యం కాదంటూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు చేసిన వాద‌న‌ను అస‌లు కేంద్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఎవ‌రికి ఇష్టం ఉన్నా, లేకున్నా... దీనిని అమ‌లు చేసిన తీర‌తామ‌ని కూడా మోదీ స‌ర్కారు కాస్తంత క‌ఠిన స్వ‌రాన్నే వినిపించింది. అంతేకాకుండా ఒక వ‌స్తువుకు ఒక రాష్ట్రంలో ఒక ధ‌ర‌, ఇంకో రాష్ట్రంలో ఇంకో ధ‌ర ఉండ‌నే ఉండ‌వ‌ని, దేశ‌మంతటా స‌ద‌రు వ‌స్తువుకు ఒకే ధ‌ర అమ‌ల‌వుతుందంటూ కూడా మోదీ స‌ర్కారు ప్ర‌క‌టించింది.

అయితే మోదీ స‌ర్కారు చెప్పిన ఈ ఘ‌న‌మైన మాట రోజుల వ్య‌వ‌ధిలోనే తుస్సుమ‌నేలా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదేదో విప‌క్షాలు చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్ర‌భుత్వం నేటి మ‌ధ్యాహ్నం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన స‌మావేశ‌మే ఈ విష‌యాన్ని తేట‌తెల్లం చేస్తోంది. దేశంలో జీఎస్టీ అమ‌లు విధానంపై చ‌ర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో కొన్ని రాష్ట్రాల‌కు జీఎస్టీ ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చే విష‌యంలపైనా చ‌ర్చ జ‌రుగుతుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని వ‌స్తువుల‌పై ఏకంగా జీఎస్టీ ప‌న్నును ఎత్తివేసే దిశ‌గానూ చ‌ర్చలు జ‌రుగుతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి ఆ జీఎస్టీ ఏఏ వ‌స్తువుల‌పై ఎత్తిపోతుందో, ఏఏ రాష్ట్రాల‌కు జీఎస్టీ నుంచి మిఇన‌హాయింపులు ల‌భిస్తాయోన‌న్న ఆస‌క్తి ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతోంది. ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జీఎస్టీ తీర‌ని న‌ష్టం వాటిల్ల‌డం కాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ త‌ర‌హా వాద‌న‌ల‌ను కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందా?  లేదంటే త‌న‌కు న‌చ్చిన రాష్ట్రాల‌కు, తాను అనుకున్న వ‌స్తువుల‌కు మాత్ర‌మే జీఎస్టీని ఎత్తివేస్తుందా? అనేది ఈ భేటీ ముగిసిన త‌ర్వాత తేలుతుందో, లేదంటే దీనిని మ‌రిన్ని రోజుల పాటు కేంద్రం నాన్చుతుందో చూడాలి.
Tags:    

Similar News