సీఎం జగన్ ప్లేస్ లో గుడివాడ... ఎందుకలా...?

Update: 2022-12-03 02:30 GMT
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే సీనియర్ మంత్రులు ఉన్నారు. కానీ ఎవరికీ లేని ప్రాధాన్యత గౌరవం యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చారు. ఆయనకు ఏకంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కట్టబెటారు. తనకు బదులుగా గుడివాడ అన్నట్లుగా ఆయనకు మర్యాదని కల్పించారు.

విషయానికి వస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ఈ నెల 4న ఉంది. విశాఖ నేవీ ఉత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాలుపంచుకోవడానికి వస్తున్నారు. అయితే ఆమెకు విశాఖలో స్వాగతం పలకాల్సినది ప్రోటోకాల్ ప్రకారం  ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. అయితే ఆ బాధ్యతలను కాస్తా ఆయన  మంత్రి గుడివాడ అమరనాధ్ కి అప్పగించారు.

అంటే సీఎం జగన్ కి బదులుగా గుడివాడ రాష్ట్రపతికి స్వాగతం పలకడంతో పాటు ఆమె విశాఖలో ఉన్నంతసేపూ అన్నీ ఆయనే చూసుకుంటారు అన్న మాట. ద్రౌపది ముర్ము విశాఖ నగరానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆమె వెంట ఉంటారు. అది ప్రోటోకాల్. నిజానికి చూస్తే సాధారణంగా రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి విమానాశ్రయంలో  స్వాగతం పలకాల్సి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.

కానీ గుడివాడకు ఈ గౌరవం దక్కింది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు కాకుండా విజయవాడ వస్తారు. దాంతో గన్నవరం ఎయిర్ పోర్టులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకుతారరన్న మాట. ఇక విజయవాడలో రాష్ట్రపతికి పౌర సన్మానం ఉంది. అలాగే ఆమెకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతీధ్యం కూడా ఉంది. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి ఆమెతో పాటుగా పాల్గొంటారు.

ఇక అక్కడ నుంచి ఆమె విశాఖ చేరుకుంటారు. దాంతో  విశాఖలో జరిగే రాష్ట్రపతి కార్యక్రమాలను  పర్యవేక్షించే బాధ్యతలను రాష్ట్ర మంత్రి గుడివాడ అమరనాధ్ కి  అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజగా  ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన హోదాను పెంచుతూ  మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దీంతో విశాఖ విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే దగ్గరనుంచి, విశాఖ నుంచి రాష్ట్రపతి తిరిగి వెళ్లేంతవరకు ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వ ప్రతినిధిగా గుడివాడ అమరనాధ్  వ్యవహరించనున్నారు. అంతే కాదు విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేవీ డేలో కూడా రాష్ట్రపతితో పాటుగా  మంత్రి అమరనాధ్ పాలుపంచుకుంటారు. ఒక విధంగా ఈ యువ మంత్రికి ఇది చాలా గొప్ప అవకాశం అని అంటున్నారు. ఎంతైనా ఆయన జగన్ కి సన్నిహితుడు కదా. అందుకే ఈ మర్యాద అని అంటున్నారు. సో గుడివాడ జగన్ తరువాత అన్న మాట అని వైసీపీలో అనుకుంటున్నారు ఇపుడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News