ఇంత‌కీ...గుజరాత్ కింగ్ ఎవరు?

Update: 2017-12-17 15:30 GMT
ఔను ఖ‌చ్చితంగా డిసెంబ‌ర్ 18 - 2017 చ‌రిత్ర‌లో కీల‌క ఘ‌ట్టానికి సాక్ష్యంగా నిలుస్తుంది. గెలుపు - ఓటుముల ప‌రంగా చూసినా..ఫ‌లితాల ప‌రంగా చూసినా...భ‌విష్య‌త్ రాజ‌కీయాల కోణంలో చూసినా..కీల‌క‌మైన గుజ‌రాత్ ఎన్నిక దీనికి కార‌ణం. ఎందుకంటే..ఇప్పుడు అందరి చూపు గుజరాత్ వైపే. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారమే బయటకు రానున్నాయి. బీజేపీ ర‌థ‌సార‌థి..ప్రధాని మోడీ త‌న అడ్డాలో తిరిగి పాగా వేయగలుగుతాడా?  ఆయ‌న జోరుకు బ్రేకులు వేసి...వరుసగా ఆరోసారీ బీజేపీనే అధికార పీఠం వరిస్తుందా అన్నది ఈ రోజే తేలుతుంది.

ఇప్ప‌టివ‌ర‌కు చూస్తే... రెండు విడతల్లో కలిపి 68.41 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 66.75 శాతం - రెండో విడతలో 69.99 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే 2012 కంటే రెండు శాతం పోలింగ్ తక్కువగానే నమోదైంది. మొత్తం 2.97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అయితే గుజరాత్ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారని తేల్చేశాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2019 సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ ఫలితాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

గుజరాత్‌ తోపాటు రేపే హిమాచల్ ప్రదేశ్‌ లోనూ కౌంటింగ్ జరగనుంది. గుజరాత్‌ లోని 33 జిల్లాల్లోని 37 కేంద్రాల్లో కౌంటింగ్ జరుపనున్నారు. కౌంటింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించడానికి పాకిస్థాన్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందన్న మోడీ ఆరోపణలతో ప్రచారం పర్వం వాడి వేడిగా సాగిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు రెండూ హోరాహోరీ ప్రచారాలు నిర్వహించాయి. చివరికి వచ్చేసరికి హామీలను పక్కనపెట్టి.. రెండు పార్టీలూ ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీని గద్దె దించడానికి అటు కాంగ్రెస్‌ తోపాటు పటీదార్ - ఓబీసీ - దళిత నేతలు హార్దిక్ పటేల్ - అల్పేష్ ఠాకూర్ - జిగేష్ మేవానీలు తీవ్రంగా ప్రచారం నిర్వహించారు.
Tags:    

Similar News