యోగికి 16 అడుగుల స‌బ్బు పంపారు

Update: 2017-06-03 10:41 GMT
ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చునే మంది చాలామంది నేత‌ల‌పై అంచ‌నాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. కానీ.. అందుకు కాస్త భిన్నం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప‌రిస్థితి. ఆయ‌న్ను యూపీ సీఎంగా ప్ర‌క‌టించిన వెంట‌నే పెద్ద ఉలికిపాటు ఎదురైంది. యోగిని.. ముఖ్య‌మంత్రిగానా? అంటూ అవాక్కు అయిన వారు లేక‌పోలేరు. అయితే..సీఎం కుర్చీలో కూర్చున్నారో లేదో.. త‌న‌దైన శైలిలో ప‌నితీరును ప్ర‌ద‌ర్శించ‌టం షురూ చేశారు.  స్వల్ప వ్య‌వ‌ధిలో పాల‌న మీద త‌న ముద్ర‌ను వేయ‌టంలో అయన‌ స‌క్సెస్ అయ్యారు.

పాల‌న ప‌రంగా కొంగొత్త విధానాల్ని అమ‌లు చేయ‌టం.. అవినీతి మ‌ర‌క‌ను ద‌గ్గ‌ర‌కు రాకుండా చూసుకోవ‌టంతో పాటు.. ప‌ని చేయ‌ని అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో వాయువేగంతో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు యోగి ఇమేజ్ ను అంత‌కంత‌కూ పెంచుతున్నాయి. అయితే.. ఈ ఉత్సాహంలో కొన్ని అప‌శ్రుతులు చోటు చేసుకుంటున్నాయి.

మొన్న‌టికి మొన్న అమ‌ర జ‌వాను ఇంటికి పరామ‌ర్శ‌కు సీఎం యోగి వెళుతున్నార‌న‌గానే.. అధికారులు కొంద‌రు వారింటికి వెళ్లి.. సోఫా.. టీవీ.. ఫ్రిజ్ లాంటివి ఏర్పాటు చేయ‌టం.. సీఎం వ‌చ్చి వెళ్లిన వెంట‌నే వాటిని తీసుకెళ్లిపోవ‌టం చేశారు. ఇది ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేసింది. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా ఈ మ‌ధ్య‌న కుషి న‌గ‌ర్ జిల్లాలోని ద‌ళితుల్ని క‌లిసేందుకు సీఎం యోగి ప్లాన్ చేసుకున్నాక‌.. అధికారులు వారికి స‌బ్బులు ఇచ్చి.. వాటితో స్నానం చేసి సీఎంను క‌ల‌వాలని చెప్ప‌టం వివాదాస్ప‌దంగా మారింది.

ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ ద‌ళిత్ సంస్థ‌.. యోగికి త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేయాల‌ని భావించింది. ఇందులో భాగంగా 16 అడుగుల స‌బ్బును త‌యారు చేసి పంపాల‌ని నిర్ణ‌యించింది. ద‌ళితుల్ని క‌ల‌వ‌నున్న సీఎం.. వారిని క‌ల‌వ‌టానికి ముందు తాము పంపిన 16 అడుగుల స‌బ్బుతో స్నానం చేసి వెళ్లాల‌ని సూచ‌న చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. సీఎం యోగి తీరు మ‌నువాదాన్ని త‌ల‌పిస్తోంద‌ని.. మ‌లిన‌మైన ఆలోచ‌న‌ల్ని ఆయ‌న క‌డుక్కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే తాము ఈ భారీ స‌బ్బును పంప‌నున్న‌ట్లుగా చెప్పారు. ఇదిలా ఉంటే.. యోగికి పంప‌నున్న స‌బ్బు 16 అడుగులే ఉండ‌టానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఏమైనా ఉందా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు మాత్రం వారు సూటిగా స‌మాధానం చెప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News