నోరు జారి.. సారీ చెప్పి తప్పుకున్న హోంమంత్రి

Update: 2016-06-20 07:10 GMT
తప్పులు చేయటం మామూలే. కాకుంటే.. చేసిన తప్పుల్ని సాగతీయకుండా తెలివిగా అందులో నుంచి బయటపడటంలోనే చాతుర్యం కనిపిస్తుంది. తాజాగా అలాంటి వైఖరిని ప్రదర్శించి వివాదంలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద ఆయన నోరు జారారు. దేశ వ్యాప్తంగా దూకుడు రాజకీయాలు నడుస్తున్న వేళ.. ఆయన నోటి నుంచి రాకూడదని మాటలు వచ్చేశాయి.

హోంమంత్రి నోటి నుంచి వచ్చిన మాటలు వివాదంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు హోంమంత్రి మీద చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేయటం మొదలెట్టారు. ఇలా అయితే.. పరిస్థితి చేయి జారిపోతుందన్న విషయం అర్థమైన కటారియా.. వెంటనే సారీ చెప్పటమే కాదు.. తాను చేసింది తప్పేనని.. పొరపాటున మాట జారేశానని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ కాంగ్రెస్ నేతలకు అంత కాలిపోయే మాట ఏమన్నారన్న విషయాన్ని చూస్తే.. హోంమంత్రి గారి అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రధాని మోడీని పొగిడే క్రమంలో మన్మోహన్ ను అవమానించేలా మాట్లాడటమే కటారియా చేసిన తప్పుగా చెప్పాలి. మన్మోహన్ సింగ్ అమెరికాకు వెళితే ఆయనకు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలకటానికి సాధారణ మంత్రులు వచ్చే వారని.. కానీ మోడీ అమెరికాకు వెళితే ఎయిర్ పోర్ట్ కు ఒబామానే స్వయంగా వచ్చి వెల్ కం చెప్పారంటూ అనకూడని మాటల్ని అనేశారు. ఇది కాస్తా వివాదం కావటంతో.. తాను వాడిన భాష తప్పేనని.. అభ్యంతరకర మాటలు తాను అన్నట్లుగా చెప్పి చెంపలేసుకున్న ఆయన.. మన్మోహన్ ను అవమానించాలన్న ఉద్దేశంతో తాను ఆ మాటలు అనలేదని.. అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. నోరు జారిన మాటను వెనక్కి తీసుకునేందుకు ఆయన పడుతున్న ప్రయాస చూసినప్పుడు.. అదేదో మాట్లాడే ముందే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడీ పరిస్థితే వచ్చేది కాదుగా అనిపించక మానదు.
Tags:    

Similar News