అమెరికాలో మరోసారి గన్ పేలింది. అక్కడి గన్ కల్చ ర్ పై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోమారు ఒహియో రాష్ట్రంలోని డేటన్ నగర సమీపంలో ఉన్న బట్లర్ అనే చిన్నపట్టణంలో మరోసారి తుపాకి కాల్పులు మోగాయి. ఒక దుండగుడు జరిపిన దాడిలో నలుగురు పౌరులు మృతి చెందారని స్థానిక పోలీసులు తెలిపారు.
సాయుధుడైన దుండగుడు 39 ఏళ్ల స్టీఫెన్ మార్లో కారులో సంచరిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి కోసం వెతుకుతున్నామని, అతను ఎస్‌యూవీలో పారిపోయాడని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా అతనిని లేదా వాహనాన్ని చూసినప్పుడు 911కి కాల్ చేయాలని పోలీసులు కోరారు. అతడు ఇంకా ఆయుధాలతో ప్రమాదకరంగానే ప్రవర్తించే అవకాశం ఉన్నందున అతడి వద్దకు ఎవరూ వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు.
కాగా దుండగుడి కాల్పుల్లో మృత్యువాత పడ్డ వారిని క్లైడ్ నాక్స్ (82), ఎవా నాక్స్ (78), సారా ఆండర్సన్ (41), ఒక బాలిక (15) గుర్తించారు. నిందితుడు ప్రయాణిస్తున్నట్లుగా చెబుతున్న కారుకు సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. దుండగుడు ఏ లక్ష్యంతో కాల్పులు జరిపాడన్నది ఇంకా స్పష్టత రాలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడికి ఇండియానా పోలీస్, షికాగో, లెక్సింగ్టన్, కెంటకీ నగరాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. మన్రో ఇప్పటికే పలు కేసుల్లో శిక్ష అనుభవించి విడుదలైనట్లు సమాచారం.