అధినేత‌ను తిట్టినోళ్లు సొంత పార్టీ పెట్టుకోవాలా?

Update: 2018-09-26 04:50 GMT
తెలంగాణ ఉద్య‌మం జోరుగా సాగుతున్న రోజులు గుర్తున్నాయా?  తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ పై ఎవ‌రైనా.. ఏదైనా మాట అన్నంత‌నే దానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున నేత‌లు రంగంలోకి దిగేవారు. కేసీఆర్ మీద చేసిన విమ‌ర్శ‌ల కంటే కూడా.. వాటికి కౌంట‌ర్ ఇచ్చే న్యూస్ ఎక్కువ‌గా ఉండేది.

అలాంటిది.. తాజాగా కొండా దంప‌తులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన వేళ‌.. వారు చేసిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ అటాక్ భారీగా ఉంటుంద‌ని ఊహిస్తారు ఎవ‌రైనా. కానీ.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై కొండా దంప‌తులు చేసిన తీవ్ర ఆరోప‌ణ‌ల‌పై పార్టీ నేత‌లు స్పందించిన తీరు చూస్తే.. గులాబీ ద‌ళంలో పోరాట ప‌టిమ‌.. అధినేత మీద ఈగ వాల‌నివ్వ‌ని తీరు అంత‌కంత‌కూ త‌గ్గిపోతుందా? అన్న సందేహం క‌లిగే ప‌రిస్థితి. కొండా సురేఖ మీద విరుచుకుప‌డేందుకు ప్రెస్ మీట్లు పెట్టిన నేత‌లు.. వారి స్థాయి చూస్తే.. స్థానికంగానే ప‌రిమిత‌మైంది త‌ప్పించి.. టీఆర్ ఎస్ ముఖ్యులు ఎవ‌రూ రియాక్ట్ కావ‌టం క‌నిపించ‌దు.

గ‌తంలో కేసీఆర్‌ ను ప‌ల్లెత్తు మాట అన్నంత‌నే ఈటెల రాజేంద‌ర్ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడేవారు. తీవ్ర ఆగ్ర‌హంతో మండిప‌డేవారు. కానీ.. తాజా ఎపిసోడ్‌ లో మాత్రం తాజా మాజీ మంత్రి కేటీఆర్‌.. టీఆర్ ఎస్ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు గుండు సుధారాణితో పాటు.. వరంగ‌ల్ జిల్లాకు చెందిన కొంద‌రు నేత‌లు మాత్ర‌మే రియాక్ట్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మిగిలిన వారంతా జ‌రుగుతున్న తంతును చూస్తూ ఉండిపోయార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సుధారాణి చేసిన వ్యాఖ్య‌ల‌ల్లోనూ తీవ్ర‌త అంతంతేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వీరు కాక‌.. టీఆర్ ఎస్ కు చెందిన కొంద‌రు నేత‌లు రియాక్ట్ అయినా.. వారెవ‌రూ పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాతులున్న వారు కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కొండా దంప‌తుల‌కు గ‌ట్టిగా రిటార్ట్ ఇచ్చిన గులాబీ నేత‌లు ఎవ‌రూ క‌నిపించ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. త‌ర‌చి చూస్తే.. ఇది కొంత‌మేర నిజ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News