జర్మనీలో దారుణ ఉగ్రకాండ

Update: 2016-07-23 04:35 GMT
ఈ మధ్యకాలంలో తరచూ ఉగ్రదాడులకు గురి అవుతున్న యూరప్ దేశాల జాబితాలో జర్మనీ ఎక్కింది. ఫ్రాన్స్ లో బాస్టిల్ డే నాడు ఒక దుండగుడు ట్రక్కుతో 87 మంది ప్రాణాలు తీసిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే తాజాగా చోటు చేసుకున్న ఉదంతం జర్మనీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఉగ్రవాడి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

జర్మనీలోని మ్యూనిచ్ నగరంలోని ప్రఖ్యాత ఒలింపియా షాపింగ్ సెంటర్ వద్దకు బ్లాక్ డ్రెస్ లలో వచ్చిన ఒక వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది మరణించినట్లు చెబుతున్నా.. ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం ఇప్పటికైతే బయటకు రాలేదు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు అక్కడి అధికారులు.. రక్షణ బలగాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.

మొత్తం ముగ్గురు తీవ్రవాదులు దాడికి సిద్ధమైనట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో.. ఘటన జరిగిన దగ్గరి ప్రాంతాల ప్రజల్ని బయటకురావొద్దన్న ప్రకటనతో పాటు.. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండొద్దని.. వీలైనంత వరకూ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. కాల్పులు జరిపిన దుండగుడు భూగర్భంలో ఉన్న రవాణా మార్గం ద్వారా పారిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో షాపింగ్ మాల్ లోనిప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు జనాలు పరుగులు తీసినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. కాల్పులు జరిపినోళ్లు ముగ్గురువరకూ ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News