రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ గా గుంటూరు వ్యక్తి?

Update: 2020-01-14 01:30 GMT
మరో రెండు నెలల తరువాత సెబీ నిబంధనల ప్రకారం భారతదేశం లో ఏ కంపెనీ కి కూడా చైర్మన్, ఎండీగా ఒకే కుటుంబీకులు ఉండరాదన్న నిబందన అమలు కానుండడం తో దేశం లోని అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కు కూడా కొత్త ఎండీ రానున్నారు. ఆ పదవి ఇప్పుడు ఓ తెలుగు వ్యక్తికి దక్కనుందన్న ప్రచారం దేశ కార్పొరేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అవును... రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టురుగా ఉన్న తెలుగు వ్యక్తి పీఎంఎస్ ప్రసాద్‌కు ఆ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎంఎస్ ప్రసాద్‌ పేరు ఈ పదవి కి ప్రముఖంగా వినిపిస్తోంది. అంబానీకి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న, ఆ సంస్థలో కీలకంగా ఉన్న మరో ఇద్దరి పేర్లూ వినిపిస్తున్నప్పటటికీ ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

పీఎంఎస్ ప్రసాద్ పూర్తి పేరు పండా మధుసూదన శివప్రసాద్.. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరం. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల్లో ప్రస్తుతం అత్యంత సీనియర్ ఈయనే. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు గా ఉన్న ఈయన రిలయన్స్ పెట్రోలియం కు సీఈవో. ఇంజినీరింగ్ చదువుకున్న ఈయన ధీరూబాయి అంబానీ కాలంలోనే రిలయన్స్‌లో చేరి ఆ కుటుంబ మెప్పు పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన జామ్ నగర్ రిఫైనరీలో ఈయన కెరీర్ మొదలైంది. ప్రస్తుతం రిలయన్స్ జియో సర్వీస్ ప్లాన్లను జనానికి చేరువ చేసే బాధ్యతనూ ముకేశ్ అంబానీ ఆయన భుజస్కంధాల పైనే పెట్టారు.

69 ఏళ్ల ప్రసాద్ ముకేశ్ అంబానీతో పాటు నీతా అంబానీ, ఆ కుటుంబంలోని చిన్నా పెద్దా అందరికీ అత్యంత సన్నిహితులు. నీతా అంబానీ కూడా ప్రసాద్‌ ను ఎండీ చేయాలని ముకేశ్ అంబానీ కి సూచించినట్లు సమాచారం.
Tags:    

Similar News