గుర్మీత్ బాబా...హైద‌రాబాద్ ఆస్తుల సంగ‌తేంటో

Update: 2017-08-25 16:24 GMT
వివాదాస్ప‌ద మ‌త‌గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు దోషిగా నిర్ధారించడం, అనంత‌రం ఆయ‌న అనుచ‌రులు ర‌చ్చ రచ్చ చేస్తుండ‌టం మ‌నంద‌రికీ తెలిసిన సంగ‌తే. అధ్యాత్మిక గురువు అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు పెద్ద ఎత్తున్నే ఆస్తులు ఉన్నాయి. పంజాబ్‌ లోని సిర్సాలోని గుర్మీత్‌ కు ఒక పెద్ద టౌన్‌ షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్‌ షిప్‌ లో పాఠశాలలు - స్పోర్ట్స్ విలేజ్ - ఆస్పత్రి - సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి. పంజాబ్‌ లోనే కాకుండా హైద‌రాబాద్ స‌మీపంలోనూ ఆయ‌న‌కు ఆస్తులు ఉన్న‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్‌ శివార్లలోని నల్గొండ జిల్లాలో పెద్ద‎ఎత్తున భూములను డేరాబాబా కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన 50 ఎకరాలను 2008లో కొనుగోలు చేసిన డేరా బాబా త‌న స్థ‌లం చుట్టూ భారీ ప్రహారీ గోడ నిర్మించాడు. 2008లోనే డేరా బాబా భూములను కొనుగోలు చేసినా ఇప్పటివరకూ ఎవరూ రాలేదని స్థానికులు అంటున్నారు. అయితే భూములు విలువైనవి కావడంతో 24గంటలూ సెక్యూరిటీ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. రైతుల నుంచి డేరా బాబా అనుచరులు ఈ భూములను కొనుగోలు చేశారని, కొన్నప్పుడే చుట్టూ భారీ ప్రహారీ గోడ నిర్మించారని స్థానికులు అంటున్నారు. హర్యానా - పంజాబ్‌‌ లను షేక్ చేస్తున్న డేరా బాబాకి తెలుగు రాష్ట్రాలతోనూ లింకులు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఈ నెల 28న కోర్టు రహీమ్‌ కు శిక్షను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఢిల్లీ ఆనంద్ విహార్ స్టేష‌న్ లో రెవా ఎక్స్‌ ప్రెస్ కు నిప్పంటించారు. ఢిల్లీ - ఉత్త‌ర ప్ర‌దేశ్ లో గుర్మీత్ అనుచ‌రులు ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. పంజాబ్  - హ‌ర్యానా లోనూ అల్ల‌ర్లు చెల‌రేగడంతో 17 మంది మ‌ర‌ణించ‌గా 200 మందికి పైగా గాయప‌డ్డారు. పంచ‌కుల‌లో జ‌రిగిన విధ్వంసంలో 12 మంది మృతి చెంద‌గా... 100 మందికి గాయాల‌య్యాయి. ఢిల్లీలో 3 బ‌స్సుల‌ను ఆందోళ‌న‌కారులు త‌గుల‌బెట్టారు.
Tags:    

Similar News